ప్రేమ కోసమై పాక్ చెరలో చిక్కి.. తెలుగు టెక్కీ లవ్‌స్టోరీ..
Publish Date:Jun 1, 2021
Advertisement
అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పేరు ప్రశాంత్. ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడింది. మనుసులైతే కలిశాయి కానీ.. తనువులు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఆమె ఉండేది స్విట్జర్లాండ్‌లో. ప్రశాంత్ హైదరాబాద్‌వాసి. మరి, ఎలా? ఆమె రావడం కుదరదు. ఇతను అక్కడి వెళ్లడానికి వీసా లేదు. ఎలాగైనా ప్రేయసిని కలుసుకుందామనుకున్నాడు. వీసా లేకున్నా.. అనధికారికంగా దొంగచాటుగా స్విట్జర్లాండ్ చెక్కేసే ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే.. మార్గమధ్యలో పాకిస్తాన్‌లో చిక్కుకుపోయాడు. అప్పటి నుంచీ పాక్ జైల్లోనే మగ్గిపోయాడు ప్రశాంత్. 2017లో జరిగిందీ ఘటన. విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి పరిస్థితి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. భారత విదేశాంగ శాఖ అధికారులకు విషయం తెలియజేశారు. వారి ప్రయత్నాలు ఫలించి.. ఎట్టకేలకు ప్రశాంత్ విడుదలయ్యాడు. వాఘా బోర్డర్ దగ్గర ప్రశాంత్‌ని భారత అధికారులకు అప్పగించారు. ప్రశాంత్ మంగళవారం హైదరాబాద్ చేరుకున్నాడు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. ప్రశాంత్‌ను కుటుంబసభ్యులకు అప్పగించారు. అమ్మ మాట వినకుండా.. ప్రేమ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా.. తాను స్విట్జర్లాండ్ వెళ్తూ పాకిస్తాన్లో చిక్కుకున్నానని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇంత త్వరగా విడుదల అవుతానని అనుకోలేదని ప్రశాంత్ అన్నాడు. తన విడుదల కోసం కృషిచేసిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వానికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. తనతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా చాలా మంది పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారని వెల్లడించాడు. ప్రేయసి కోసం దేశ సరిహద్దులు దాటడానికి ఆయన చేసిన సాహసం గొప్పదే. ప్రేమ మైకం ముందు తాను చేస్తున్న ప్రయాణం అక్రమనే విషయం మరిచాడు. అదృష్టం కలిసిరాకపోవడంతో పాక్ అధికారులకు చిక్కి.. ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోయాడు. ఇక తన జీవితం అక్కడే అంతం అవుతుందని అనుకున్నాడు. కానీ, అతని తల్లిదండ్రుల విజ్ఞప్తితో, తెలంగాణ పోలీసుల కృష్టితో.. భారత్ ప్రభుత్వ ప్రయత్నంతో.. ప్రశాంత్ పాక్ నుంచి బయటపడ్డాడు. మరో, భజరంగీ భాయీజాన్‌గా నిలిచాడు.
http://www.teluguone.com/news/content/telugu-techie-prashanth-love-story-25-116741.html





