ఏడేండ్ల తెలంగాణ ఎట్లుంది! చెదిరిన స్వప్నమేనా ?
Publish Date:Jun 1, 2021
Advertisement
ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ఏళ్ల పోరాటం, ఇంకా ఎందరో అమాయకుల ప్రాణత్యాగం ... ఈ అన్నిటి ప్రతిఫలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ఏడేళ్ళ క్రితం, 2014 జూన్ 2 వ తేదీన 29 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో ఆవిర్భవించిన రాష్ట్రం ఈ ఏడేళ్ళలో, లక్ష్యసాధనలో ఎంత దూరం పయనించింది. ప్రజల ఆశలు,ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. అయితే ఒకటి మాత్రం నిజం, ఏ ‘ప్రత్యేక’ లక్ష్యాల కోసం అయితే, యువకులు బలిదానాలు చేశారో, ఆ లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా, నీళ్లు, నిధులు , నియామకాలు అనే మూడు లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమం సాగింది. సాగునీటి రంగంలో కొంత ప్రగతి కనిపిస్తున్నా, ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక నిధులు విషయంలో అయితే పంకాలు జరిగిపోయాయి కాబట్టి, ఆంధ్ర పాలకులు అన్యాయం చేసే అవకాశమే లేదు. అందుకే ఆ అన్యాయం ఏదో తెలంగాణ పాలకులే చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయింది. అందరికంటే ఎక్కువగా అన్యాయమై పోయింది, విద్యార్ధులు నిరుద్యోగ యువత. తెలంగాణ కోసం నిజంగా పరితపించింది, ప్రాణత్యాగాలు చేసింది విద్యార్ధులు, నిరుద్యోగ యువత. సుమారు 1600 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేస్తే అందులో అత్యధిక మంది విద్యార్ధులు , నిరుద్యోగ యువత. యువత ప్రనత్యగాల వల్లనే, తెలంగాణ సాధ్యమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ యువత బలిదానాలకు చలించే, తల్లులుగా స్పందించారు. తెలంగాణ సాకారం కావడానికే, ఆ ఇద్దరు ప్రధాన కారణం అయితే, ఆ ఇద్దరూ సానుకూలంగా స్పందించేలా చేసింది మాత్రం, తెలంగాణ యువకుల బలిదానాలు. అయితే దురదృష్టం ఏమంటే ఆ బలిదానాలకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన తెరాస, నీళ్లు, నిదుల విషయంలో ఎలా ఉన్నా, నియామకాల విషయంలో మాత్రం ఉద్యమ స్పూర్తిని చంపేసింది. నియంకాలే కాదు, ఉన్న ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరై పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండవని ఉద్యమ నేతగా ఇచ్చిన హామీని, ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచి పోయారు. ఆయన మరిచి పోయింది ఆ ఒక్కటే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ఇచ్చిన హామీనీ ఆయన మరిచి పోయారు. రాష్ట్రంలో సుమారు 25నుంచి 30 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉంటారని అంచనా ... ఈ అందరికీ నెలకు నెలకు రూ. 3016 వంతున నిరుద్యోగ భ్రుతి ఇస్తామని తెరాస ప్రకటించి, రెండేళ్ళు పూర్తయింది. అయినా ఇంతవరకు విధి విధానాలు కూడా ఖరారు కాలేదు. చివరకు కోర్టు మొట్టికాయలు వేస్తేనే కానీ ,తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదంటే, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది వుందో అర్థం చేసుకోవచ్చని నిరుద్యోగ యువత ఆవేదన, ఆగ్రహం వ్యకంచేస్తున్నారు. ఇక ప్రతి పక్షాలు తెలంగాణలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేస్తున్నాయి. ఆర్థిక రంగం విషయానికి వస్తే, మిగులు ఆదాయంతో ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం, ఇప్పడు అప్పుల ఉబిలో కూరుకు పోయింది. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఇంచుమించు రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. వీటికి కట్టే కిస్తీలు, మిత్తీలకే ప్రస్తుత 2021-22 బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లకు చేరనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్లోనే ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించింది. దీనికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట రూ.1,05,006 కోట్ల రుణాలకు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. వీటిని బడ్జెట్లో చూపించకుండా దాటవేసింది. కార్పొరేషన్ల పేరిట చేసిన ఈ అప్పులన్నీ చివరకు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. అందుకే వీటిని కూడా కలిపితే.. రాష్ట్రం చేసిన అప్పుల అసలు లెక్క బయటపడుతోంది. తెలంగాణపై ఉన్న అప్పు మొత్తం రూ. 3,91,810 కోట్లు అని లెక్కతేలుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయినా ... ఏరంగంలో చూసినా తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర లేదు. ఉచిత విద్యుత్, 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు రుఅమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మీ, వంటి సంక్షేమ పథకాలే కానీ, ప్రజల జీవితాలలో శాశ్వత వెలుగులు నింపే సంకల్పమే కనిపించడం లేదు. ఇక బంగారు తెలంగాణ అయితే ఎప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.
http://www.teluguone.com/news/content/telanagana-seventh-farmation-day-25-116746.html





