చట్టంపై గౌరవంతో భగీరథ్‌ను పోలీసులకు అప్పగించా : బండి సంజయ్
Publish Date:May 16, 2026
Advertisement
తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, “చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే” అని స్పష్టం చేశారు.భగీరథ్ ఎలాంటి తప్పు చేయలేదని తన కుమారుడు పదేపదే చెబుతున్నాడని పేర్కొన్న బండి సంజయ్, ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని భావించినట్లు తెలిపారు. అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచినట్లు చెప్పారు. ఆ ఆధారాలను పరిశీలించిన న్యాయవాదులు కేసు కొట్టివేయబడే అవకాశముందని, బెయిల్ కూడా తప్పకుండా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ కారణంగానే కొంత జాప్యం జరిగిందని పేర్కొన్నారు.ఇప్పటికీ బెయిల్ వచ్చే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నప్పటికీ, ఇక ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో భగీరథ్‌ను స్వయంగా తీసుకువచ్చి అడ్వోకేట్ల సమక్షంలో పోలీసులకు విచారణ కోసం అప్పగించినట్లు తెలిపారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణ నమ్మకం ఉందని బండి సంజయ్ అన్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయ వ్యవస్థపై గౌరవంతో విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భగీరథ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు బండి భగీరథ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి వెల్లడించారు.పోలీసుల ప్రకారం, బండి భగీరథను నార్సింగి పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం అతడిని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు కమిషనర్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/bandi-sai-bhagirath-36-220033.html





