నిరుద్యోగులు పరాన్నజీవులు సీజేఐ సంచలన వ్యాఖ్యలు
Publish Date:May 16, 2026
Advertisement
కామెంట్లపై సీజేఐ సూర్యకాంత్ వివరణ.. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వెల్లడి.. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతున్న సమయంలో న్యాయవ్యవస్థపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సమాజంలోని కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి సీజేఐ వాడిన పదజాలం ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. దీంతో అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అనే విషయాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ల హోదా కేటాయింపు మార్గదర్శకాల అమలులో ఆలస్యం జరుగుతోందంటూ దాఖలైన ఒక కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన లాయర్ ప్రవర్తనపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీనియర్ లాయర్ హోదా అనేది కోర్టు ఇచ్చే గౌరవమని, దాన్ని ప్రతిష్ట కోసం ఆశించి ఇలాంటి పిటిషన్లు వేయడం సరికాదని కోర్టు మందలించింది. సదరు లాయర్ గతంలో ఫేస్బుక్లో న్యాయవ్యవస్థపై వాడిన భాషను కూడా సీజేఐ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రొఫెషనల్ డిసిప్లిన్ అంటే ఏంటో చూపిస్తామంటూ ధర్మాసనం హెచ్చరించింది. ఈ క్రమంలోనే వ్యవస్థలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ సీజేఐ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో కొందరు పరాన్నజీవుల్లా మారి వ్యవస్థలను టార్గెట్ చేస్తున్నారని, పిటిషనర్ కూడా వారితో చేతులు కలపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే కొందరు నిరుద్యోగ యువకులు బొద్దింకల మాదిరిగా తయారవుతున్నారని, వారికి వృత్తిలో సరైన ఉపాధి లేదా గుర్తింపు దక్కకపోవడంతో మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివిస్టులుగా అవతారమెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. అలా మారి ప్రతి ఒక్కరిపై బురదజల్లడమే పనిగా పెట్టుకుని వ్యవస్థలపై అటాక్ చేస్తున్నారంటూ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు నల్లకోటు వేసుకుని తిరుగుతున్న చాలా మంది లాయర్ల డిగ్రీల అథెంటిసిటీపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దేశంలో నకిలీ డిగ్రీలతో లాయర్లుగా చలామణీ అవుతున్న వారి సర్టిఫికెట్లను సీబీఐతో వెరిఫై చేయించాలని అనుకుంటున్నట్లు కోర్టు పేర్కొంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఘాటుగా విమర్శించింది. కోర్టు ఆగ్రహాన్ని చూసిన సదరు పిటిషనర్, వెంటనే ధర్మాసనానికి క్షమాపణలు చెప్పి తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అయితే ఈ విచారణలో సీజేఐ వాడిన "బొద్దింకలు", "పరాన్నజీవులు" అనే పదాలు నిరుద్యోగ యువతను అవమానించేలా ఉన్నాయంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. అయితే కోర్టు వ్యవస్థలను అప్రతిష్ట పాలుచేసే ఫేక్ యాక్టివిస్టులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు వాదిస్తున్నారు. సీజేఐ వివరణ ఇచ్చారు. ‘మీడియా నా వ్యాఖ్యలను తప్పుగా రిపోర్ట్ చేసింది. నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి, మీడియా, సోషల్ మీడియాలోకి వచ్చిన వారిని తప్పుబట్టాను. అలాంటి వారు పరాన్నజీవులని చెప్పాను. యువతను విమర్శించలేదు, భారత యువత గర్వకారణం. భారత యువతే అభివృద్ధికి మూల స్తంభం’’ అని తెలిపారు.
http://www.teluguone.com/news/content/-cji-surya-kant-remarks-36-220020.html





