కులం పేరుతో తిట్టి, కొట్టి.. డిప్యూటీ సీఎం ఇలాఖాలో దారుణం..
Publish Date:Mar 2, 2022
Advertisement
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని అప్పు తీసుకున్న దళితుడి కాలు, చేతులు విరిచిన ఘటన డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు మండలం పెద్దకంటిపల్లి కి చెందిన చంద్రన్ అదే పంచాయతీకి చెందిన కలిజవేడు వాసి ఈశ్వర్ రెడ్డి దగ్గర 10 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే.. చెప్పిన సమయానికి చంద్రన్ బాకీ చెల్లించలేకపోయాడు. దీంతో చంద్రన్ ను ఈశ్వర్ రెడ్డి తన మామిడి తోటలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టి చంద్రన్ కాలు, చేయి విరిచేశాడు ఈశ్వర్ రెడ్డి. తీవ్రంగా గాయపడిన చంద్రన్ ను వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రన్ చికిత్స పొందుతున్నాడు. చంద్రన్ పై ఈశ్వర్ రెడ్డి దాడిచేసి గాయపరిచిన విషయాన్ని బాధితుని కుటుంబ సభ్యులు జీడీ నెల్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దళితుడైన చంద్రన్ పై దాడి చేయడాన్ని టీడీపీ, బీఎస్పీ నేతలు, ప్రజా సంఘాలు ఖండించారు. నిందితుడిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఎస్సీ కమిషన్ చైర్మన్ కి బీఎస్పీ నేతలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిందితుడు ఈశ్వర్ రెడ్డి పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం ఇలాఖాలోనే ఇలాంటి ఘటన జరగడం దారుణం అన్నారు. తన నియోజకవర్గంలో.. అదీ తన దళితజాతినే చంపేస్తున్నా.. పట్టించుకునే తీరిక నారాయణస్వామికి లేదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ దారుణ ఘటనతో మరోసారి రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణలేదని స్పష్టమైందన్నారు లోకేష్. కేవలం పదివేల రూపాయలు బాకీ చెల్లించలేదని చంద్రన్ ని మామిడితోటకి ఎత్తుకెళ్లిన ఈశ్వర్ రెడ్డి కాళ్లూ చేతులూ విరగ్గొట్టించడం పైశాచికానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. నిత్యం సీఎం జగన్ భజనలో మునిగి తేలే దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి మీ దళితజాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే స్పందించే తీరికే లేదా అంటూ లోకేష్ తీవ్రంగా స్పందించారు.
http://www.teluguone.com/news/content/attack-on-a-person-for-loan-non-repayment-39-132449.html





