ఢిల్లీ కిడ్నాప్ వెనక మంత్రి హస్తం?
Publish Date:Mar 2, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఏమిటీ? అనే విషయంలో అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. కుటుంబంతో పాటు వెళ్లారు కాబట్టి, కుటుంబ పని మీద, వారి సతీమణి ఆరోగ్య పరీక్షల కోసం వెళ్ళారని అనుకోవచ్చును. కానీ, ఆయన వెంట కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, రాజకీయ బంధువులు కూడా వెళ్ళారు. అందులో, మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా ఉన్నారు. వినోద్, సంతోష్, ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చును. ఆ ఇద్దరికీ రాజకీయ బంధుత్వంతో పాటుగా కుటుంబ బంధుత్వం కూడా ఉంది. ఒకరు సలహాలు ఇచ్చేందుకు, ఇంకొకరు గోలీలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చును. కానీ, శ్రీనివాస గౌడ్ ముఖ్యమంత్రి వెంట ఢిల్లీ ఎందుకు వెళ్లారు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. నిజానికి, మంత్రి శ్రీనివాస గౌడ్ ఎందుకు వెళ్ళారనే సందేహం మాములుగా అయితే రాక పోవునో ఏమో, కానీ, అదే సమయం ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి నుంచి మంత్రి గారి సొంత జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్’కు గురయ్యారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నలుగురుని దుండగులు తీసుకెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వారిని, ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది స్పష్టం కాలేదు. కానీ, ఈ కిడ్నాప్ కథ వెనక మంత్రి శ్రీనివాస గౌడ్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నలుగురు వ్యక్తులకు మంత్రి శ్రీనివాస గౌడ్’ పదవికే ఎసరుగా మారిన అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసుతో సంబంధాలున్నాయని, ఆ నలుగురి ఆరోపణతోనే, కేసు నమోదైందని సమాచారం. అందుకే, కిడ్నాప్ వెనక మంత్రి హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే , ఆ నలుగురిపై పాత కేసులు ఉన్నాయని అందుకే తెలంగాణ పోలీసులే వారని తీసుకొచ్చారని తెరాస వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పోలీసు నుంచి ఎలాంటి అధికార సమాచారం లేదు. అయితే, కిడ్నాప్’కు గురైనట్లు చెపుతున్న నులుగురిలో ఒకరి సతీమణి మహబూబ్’ నగర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ‘ఎక్కడికీ పోలేదులే, రెండు రోజుల్లో వస్తారని’ సీఐ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే, మంత్రి అఫిడవిట్ ట్యాంపరింగ్ ఆరోపణలపై, కేంద్ర ఎన్నికల సంఘం జరుపుతున్న విచారణ తుది దశకు చేరుకుందని, ట్యాంపరింగ్ చేసినట్లుగా దాదాపుగా నిర్ధారణ అయిందని శ్రీనివాస్ గౌడ్‌పై అనర్హతా వేటు పడటమే తరువాయి అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ట్యాంపరింగ్ ఆరోపణలు చేసిన వ్యక్తులే కిడ్నాపయ్యారు. అందుకే ఇదంతా శ్రీనివాస్ గౌడ్ చేయించారని.. ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో అరెస్టు చేయించారని చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కంటే,అయన వెంట మంత్రి శ్రీనివాస గౌడ్ ఎందుకు వెళ్ళారు? అనేదే మిలయన్ డాలర్ల ప్రశ్నగా తెర మీదకు వచ్చిందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/minister-hand-behind-delhi-kidnap-39-132446.html





