వాడి.. వేడిగా ‘బడ్జెట్’
Publish Date:Feb 13, 2012
Advertisement
హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకోవాలని తెరాస నిర్ణయించడంతో మొదటి రోజే గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. విపక్షాల నుంచే కాక స్వపక్షం నుంచి కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా జరగనున్నాయి. వివిధ కారణాల వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ‘వర్క్ టు రూల్’ పాటించాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వ ధిక్కార ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడక పోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ‘మా మీద అనర్హత వేటైనా వేయండి, లేదంటే అసెంబ్లీలో విడిగా మాకు సీట్లయినా కేటాయించండి ’ అని జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రేడ్డి స్పీకర్ను కోరారు. తమ పదిహేడు మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు కూడా ఆయన చెప్పారు. కాగా, ఎమ్మార్, ఓబుళాపురం, జగన్ ఆస్తుల కేసులపై సిబిఐ జరుపుతున్న విచారణలు, మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసే అవకాశం ఉంది. ఈ అంశాలను సభలో లేవనెత్తడం ద్వారా అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తుండగా, విపక్షాలపై ఎదురు దాడికి అధికార పక్షం సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే ప్రజా సమస్యలపై కన్నా రాజకీయంగా లబ్ధి చేకూర్చే అంశాలపైనే సభలో ఎక్కువ చర్చ జరిగే అవకాశాలున్నాయి.
సిబిఐ విచారణ జరపుతున్న తీరును నిరసిస్తూ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడం, అనంతరం ఐఏఎస్ అధికారులు నేరుగా మంత్రులపైనే విమర్శలు చేయడంతో ఈ విషయాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అదే విధంగా మద్యం సిండికేట్లపై ఎసిబి జరిపిన దాడుల్లో ముడుపులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిందీ అన్న వివరాలు బహిర్గత మవడం, సాక్షాత్తు ఎక్సైజ్ మంత్రికే ముడుపులు ఇచ్చినట్లు ఖమ్మం జిల్లాకు చెందిన మద్యం సిండికేట్ నాయకుడు విచారణలో చెప్పడం, దాన్ని అలానే ఏసిబి కోర్టుకు అందజేసిన రిమాండ్ డైరీలో పేర్కొనడంతో దీనిపై తీవ్ర స్థాయిలో వివాదం ఏర్పడింది. మద్యం ముడుపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి మోపిదేవి వెంకట రమణను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులకు కొన్ని మద్యం షాపులు ఉన్న విషయాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇక తెరాస విషయానికి వస్తే తెలంగాణ అంశమే ప్రధాన అజెండాగా ఆ పార్టీ వ్యవహరించనుంది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంతో తెరాస వ్యూహం మొదలు కానుంది.
http://www.teluguone.com/news/content/assembly-24-11854.html





