హైకోర్టుకు అషురెడ్డి
Publish Date:Apr 28, 2026
Advertisement
సోషల్ మీడియా సెలబ్రిటీ, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ప్రవాస భారతీయుడి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిందనే ఆరోపణలు ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం రేపుతున్నాయి. సుమారు 9.35 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీసీఎస్ లో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే యువకుడిని అషు రెడ్డి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2018లో వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారిందనీ.. ఆ క్రమంలోనే అషు రెడ్డి ధర్మేంద్ర నుంచి భారీగా నగదు, ఆస్తులను తన పేరిట రాయించుకుందని బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, స్థిరాస్తులను పొందారు. ఈ మొత్తం విలువ రూ. 9.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అషు రెడ్డి మొహం చాటేయడమే కాకుండా.. తనపైనే తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అరెస్ట్ భయం ఉండటంతో.. , అషు రెడ్డి న్యాయ నిపుణులను సంప్రదించి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కావాలనే దురుద్దేశంతో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయంగా లేదా వ్యక్తిగత కక్షతోనే ఈ కేసు పెట్టారని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారనీ.. ఆ కేసు రద్దు చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా పలు వివాదాల్లో నిలిచిన అషు రెడ్డికి ఈసారి ఎదురైన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. కేవలం డబ్బు కోసమే హనీట్రాప్ పద్ధతిలో మోసం చేశారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే అషు రెడ్డి మాత్రం సోషల్ మీడియా వేదికగా ఈ ఆరోపణలను ఖండించారు. హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు అషు రెడ్డి బ్యాంక్ అకౌంట్ వివరాలు, గత ఏడేళ్లలో ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ashu-reddy-approaches-high-court-36-218458.html





