బుమ్రా అవుట్.. టీమిండియాలోకి కశ్మీర్ స్టార్ అకిబ్ నబీ!
Publish Date:Aug 3, 2026
Advertisement
భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. శ్రీలంకతో త్వరలో జరగబోయే అత్యంత కీలకమైన టెస్టు సిరీస్ నుంచి భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న బుమ్రాకు వైద్యులు విశ్రాంతి సూచించడంతో బిసిసిఐ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రతికూల పరిస్థితి ఒక సరికొత్త రికార్డుకు, ఒక యువ ఆటగాడి జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గాయపడిన బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన 29 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ అకిబ్ నబీని భారత జాతీయ టెస్టు జట్టులోకి ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ ఎంపిక భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. అకిబ్ నబీ టీమిండియాకు ఎంపికవ్వడం సాధారణ విషయం ఏమీ కాదు. కశ్మీర్ లోయలోని బారాముల్లా జిల్లాకు చెందిన ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి జాతీయ స్థాయి టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం వెనుక ఆయన ఏళ్ల నిరంతర శ్రమ, అసాధారణ ప్రతిభ దాగి ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే వారిద్దరూ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20) మ్యాచ్‌లలో మాత్రమే ఆడగా, కశ్మీర్ లోయ నుంచి నేరుగా ప్రతిష్టాత్మకమైన భారత టెస్ట్ జట్టులోకి ఎంపికైన తొలి క్రికెటర్‌గా అకిబ్ నబీ చరిత్ర సృష్టించాడు. జమ్మూ కశ్మీర్ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో అకిబ్ నబీ నమోదు చేసిన గణాంకాలు, సాధించిన రికార్డులే అతనికి ఈ సువర్ణ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏకంగా 104 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా 2025–26 రంజీ ట్రోఫీ సీజన్లో అకిబ్ నబీ విజృంభించి ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. జమ్మూ కశ్మీర్ జట్టు సాధించిన చారిత్రక విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం బౌలింగ్ లోనే కాకుండా లోయర్ ఆర్డర్లో ఉపయోగపడే బ్యాటింగ్ నైపుణ్యాలు కూడా అతనికి ఉండటం విశేషం. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా–ఎ పర్యటనలో కూడా సత్తా చాటి 6 వికెట్లు పడగొట్టి సెలక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. jammu kashmir fast bowler aqib nabi selected india test team,bumrah injured out of sri lanka test series.
http://www.teluguone.com/news/content/aqib-nabi-replaces-jasprit-bumrah-ind-vs-sl-test-36-227919.html





