ప్యాకేజీ అంటే... నేతి బీరకాయలోని నెయ్యే!
Publish Date:Sep 3, 2016
Advertisement
మీడియా, తెలివైన మేధావులు, వాళ్లకంటే తెలివైన రాజకీయ నాయకులు అంతా కలిసి గత కొన్ని రోజుల్లో ప్రత్యేక హోదా అనేది అసాధ్యం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేశారు. ఎక్కడైనా ఎవరైనా ప్రత్యేక హోదా కావాల్సిందే అనే స్టేట్మెంట్ ఇస్తే ... వాళ్లది వితండవాదం అన్నట్టుగా, స్కూలుకు పోనని ఏడుస్తున్న చిన్న పిల్లల పెంకితనం మాదిరిగా బిల్డప్ ఇస్తున్నారు! జనం కూడా ప్రత్యేక హోదా అనేది ... రెండు కాళ్లు లేని వాడు నాట్యం చేయటం లాంటిది, రెండు చేతులు లేని వాడు కుస్తీ పట్టు పట్టడం లాంటిది అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారు! ఏపీకి ప్రత్యేక హోదా... దీన్ని అసలు ఎవరు ఇస్తామన్నారు? కేంద్రం! కాని, ఇప్పుడు కుదరదని చెప్పకనే చెబుతోన్నది ఎవరు? కేంద్రమే! అప్పుడు ఇస్తామన్నది యూపీఏ. ఇప్పుడు ఇవ్వటం కుదరదని చెబుతోన్నది ఎన్డీఏ. ఆంధ్ర ప్రజల అభిప్రాయం, వాళ్లకు జరిగే లాభ, నష్టాలు ఇవేవీ చర్చలోకే రావటం లేదు. ప్యాకేజీ ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి నిధినిస్తాం, హోదాలో వుండే లాభాలన్నీ ప్యాకేజీలోనే ఇచ్చేస్తాం అంటూ బురిడీ మాటలు చెప్పేస్తున్నారు! అన్నీఇచ్చేదే వుంటే... హోదానే ఇవ్వొచ్చు కదా? ఇక్కడే వుంది అసలు ట్విస్ట్! ఢిల్లీ ప్రభుత్వం... ''హోదాలో వున్న సరుకంతా ఇస్తాం కాని, దానికి ప్యాకేజీ అని లేబుల్ పెడతాం... '' అనటం ఎలాగుందంటే... చీరా, సారె, నగలు, నట్రా అన్నిటితో అలంకరించిన పెళ్లికూతుర్ని ఇస్తాం... కాని, ఆ పెళ్లి కూతురు బొమ్మ పెళ్లి కూతురు! మనిషి కాదు అన్నటుగా వుంది! హోదా కాకుండా ప్యాకేజీ ఇవ్వటం అంటే.... అయిదేళ్లో, పదేళ్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని ఖర్చులు భరించి వైద్యం చేయించటం! ప్యాకేజీ అంటే ... కెమెరాల ముందు మంచం వద్దకొచ్చి.. పళ్లు, బ్రెడ్డు అందించి చెక్కేయటం! ఈ తేడా మన మీడియా, మేధావులు, జనం గుర్తించాలి! రాజకీయ నాయకులు తెలిసినా తెలియనట్లు నటించే అవకాశాలే పుష్కలం...
మన పురాణాల్లోని కథలు మీరెప్పుడైనా గమనించారా? చాలా మంది తపస్సు చేస్తుంటారు. వెంటనే బ్రహ్మో, శివుడో ప్రత్యక్షం అవుతుంటారు. వాళ్లని తపస్సు చేసిన వారు మరణం లేకుండా వరం ఇవ్వమంటారు. అది కుదరదని నానా రకాల ఇతర టెంప్టింగ్ ఆఫర్స్ అందిస్తారు దేవుళ్లు! అవ్వన్నీ విని కొందరు సంబరపడిపోయి అమాయకంగా ఓకే చేసేస్తారు! మరికొందరికి ఆ వరాలన్నీ ఉత్తివే అని తెలిసినా, మరణం తప్పదని అర్థమైనా... కష్టపడి తపస్సు చేశాం కదా అని తలాడిస్తారు! లేదంటే ఏ వరమూ ఇవ్వకుండా దేవుడు మాయమైపోవచ్చు! అదీ ప్రాబ్లం...
ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు అంటే... ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోన్న ప్రత్యేక ప్యాకేజ్ గురించే! మీరు సరిగ్గా గమనించారో లేదో చర్చ అటు తిరిగి ఇటు తిరిగి ఈ మధ్య ఎక్కడి దాకా వచ్చిందంటే... మీడియాలో నేరుగా ప్రత్యేక ప్రకటన, ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ మెంట్ అనేస్తున్నారు! అసలు ప్రత్యేక హోదా అన్న పదమే తక్కువగా వినిపిస్తోంది! అది పూర్వకాలంలో తపస్సు చేశాక మరణం లేకుండా వరం ఇమ్మన్నట్టుగా తయారైపోయింది! ప్రత్యేక హోదా ఆంధ్రుల తీరని కోరికే తప్ప ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యేది కాదు అన్నట్టుగా వుంది ఛందం!
http://www.teluguone.com/news/content/ap-special-status-45-66023.html





