కొందరినే టార్గెట్ చేశారా? ఒక్క ఆధారం లేకుండానే కేసులా..!
Publish Date:Dec 21, 2021
Advertisement
ఏపీ సీఐడీ తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంలో అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లేకుండానే కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. సంస్థకు ఎండీగా ఉన్న వ్యక్తిని కాదని డైరక్టర్ ఉన్న వ్యక్తిని ఏ-1గా పెట్టడం పైనా విమర్శలు వస్తున్నాయి. నిర్ణయాలు తీసుకుని, డబ్బులు రిలీజ్ చేసిన వారిని పట్టించుకోకుండా సలహాలు ఇచ్చిన వ్యక్తిపై కేసు పెట్టడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు నిధులు దుర్వినియోగం చేశారని ఏదైనా ఆధారాలు ఉన్నాయా ? అన్న హైకోర్టు ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సీఐడీ దగ్గర సమాధానం లేకపోయింది. దీంతో స్కిల్ డెలవప్‌మెంట్ స్కాంలో ఏ-1గా చూపించిన గంటా సుబ్బారావుకు హైకోర్టు షరతుల బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ విచారణకు హాజరు కావాలంటే 24 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్కిల్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ స్కాం జరిగిందని సీఐడీ కేసులు పెట్టింది. ఘంటా సుబ్బారావుతోపాటు మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణతో సహా పలువుర్ని నిందితులుగా చేర్చారు. అయితే నిధులు విడుదల చేసింది అప్పటి ఎండీ మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి అని అలాగే నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు సీఎంవోలో కీలకంగా ఉన్న షంషేర్ సింగ్ రావత్, అజయ్ జైన్‌లు అని వారిని కాకుండా కేవలం సలహాలకు మాత్రమే పరిమితయ్యేవారిపై కేసులు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కీలకమైన వ్యక్తుల్ని వదిలేసి కొంతమందిని మాత్రమే కేసులో నిందితులుగా పేర్కొనడం పట్ల సుబ్బారావు తరపు న్యాయవాది ఆదినారాయణ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమందిని కావాలని కేసులో ఇరికించారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. హైకోర్టులో విచారణ సందర్భంగా నిధులు విడుదల చేసినవారిపై కేసులు పెట్టకపోవడంపై ప్రశ్నలు రావడంతో సీఐడీ రూట్ మార్చింది. మరో ఇద్దరు మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది.సీఆర్‌పీసీ 160 కింద మాజీ ఎండీ-సీఈవో ప్రేమచంద్రారెడ్డికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌కు నోటీసులిచ్చిం ది. కార్పొరేషన్ ఏర్పాటు నుంచి రూ.371 కోట్ల విడుదల వరకూ జరిగిన వ్యవహారాలకు సంబంధించి 40 ప్రశ్నలు సంధించి ప్రేమ్‌చంద్రారెడ్డిని వివరణ అడిగింది. ‘అప్పట్లో ఏం జరిగింది.? నాటి సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందా.? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలుసా..? ప్రతిపాదనలు ఎవరిచ్చా రు..? ఎక్కడి నుంచి ఫైలు వచ్చింది.. డబ్బుల విడుదలకు ముందు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా.? న్యాయశాఖ అనుమతించిందా..? మంత్రివర్గ తీర్మానం అమలు చేశారా.? నిబంధనలన్నీ పాటించారా.? పాటించని వాటి గురించి మీరు ప్రస్తావించారా..’ అని తదితర ప్రశ్నలు అడిగారు. ఈ నెల 17నే ప్రేమ్‌చంద్రారెడ్డికి నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు.. సోమవారం పీవీ రమేశ్‌కు ఇచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇంటి మరమ్మతుల కారణంగా ఆయన వేరే ఇంటికి మారడంతో సీఐడీ బృందం వాటిని కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/ap-high-court-questioned-ap-cid--25-128796.html





