ఏపీలో మళ్లీ పవర్ కట్స్.. ఈసారి రైతులకు షాక్..
Publish Date:Feb 19, 2022
Advertisement
ఏపీని అన్ని విధాలా అధోగతిపాలు చేసిన జగన్ రెడ్డి ఏలుబడిలో ఏ వర్గాన్నీ సుఖంగా, ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఏపీని ఆర్థికంగా దివాలా తీసే దశకు తీసుకొచ్చిన వైసీపీ సర్కార్ అనాలోచిత, నిర్లక్ష్య ధోరణి కారణంగా నలుగురికీ అన్నం పట్టే రైతన్నలకు మళ్లీ కష్టాలు వచ్చిపడ్డాయి. జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోని ధోరని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి విద్యుత్ కోతలు మొదలయ్యాయి. దీంతో అన్నదాతలు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వేసిన పైర్లను ఎలా కాపాడుకోవాలో తెలియక నానా అవస్థలూ పడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు ఉన్నారు. విద్యుత్ కోసం పొలాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితిలోకి అన్నదాతలను జగనన్న సర్కార్ నెట్టేసింది. దీంతో కడుపు మండిన రైతన్నలు ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ఆక్వా రైతులు తమ రొయ్యల పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ జనరేటర్లను అద్దెకు తెచ్చుకుని వినియోగిస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలకు, నలుగురికీ ఇంత అన్నం పెట్టే వ్యవసాయానికి కూడా పవర్ కట్ ఇబ్బందులు తలెత్తడానికి జగన్ రెడ్డి సర్కార్ ఏవేవో సాకులు చెబుతోందని రైతన్నలు ఫైరవుతున్నారు. ఆన్ లైన్ బిడ్డింగ్ లో విద్యుత్ లభించకపోవడమే సమస్యకు కారణం అని డిస్కంలు చెబుతుండడం గమనార్హం. ఏపీలో డిస్కంలు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని విద్యుత్ అధికారులు వాపోతున్నారు. డిస్కంలకు కేంద్రం నుంచి రుణాలు రావడం లేదని ఏపీ విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు ఇప్పటికే బకాయి పడిన కోట్లాది రూపాయలు చెల్లించడం దారుణంగా ఏపీ సర్కార్, డిస్కంలు విఫలం కావడమే ఈ దుస్థితికి కారణంగా ఉంది. విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని గతంలోనే జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ లేఖ రాసింది. అయితే.. ఎన్ టీపీసీ లేఖపై స్పందించకపోగా.. మరో దారిలో విద్యుత్ కొనుగోలు చేయాలని విఫల యత్నాలు ఏపీ సర్కార్ చేసింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ మరో లేఖ రాసింది. ఏపీకి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటే ఇప్పటికే బకాయి పడిన 390 కోట్ల రూపాయలు రేపటి లోగా చెల్లించాలని ఆ లేఖలో పేర్కొంది. పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించకపోటే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని ఎన్టీపీసీ హెచ్చరించింది. ఇప్పుడైనా ఎన్టీపీసీకి పడిన బకాయిలు ఏపీ సర్కార్ ఎప్పుడు చెల్లిస్తుందో? తమ పంటలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఎప్పుడు చేస్తుందో అని అన్నదాతలు ఆశగా ఎదురుతెన్నులు చూస్తున్నారు. లేదా అప్పుల కోసం మరో కొత్త దారి ఏదైనా వెతుకుతూ.. మరింత కాలం విద్యుత్ సరఫరాలో కోతల వాతలు పెడుతుందో.. అని, తమ పొలాల్లో పైర్లు సాగునీరు లేక ఏమైపోతాయో అనే ఆందోళనతో రైతులు నలిగిపోతున్నారు.
http://www.teluguone.com/news/content/ap-farmers-facing-power-cut-problems-again-39-131994.html





