ఉచితాలతో ఎన్నికలకు ముడి.. అందుకే జగన్ ముందస్తు సవ్వడి!
Publish Date:May 7, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు అనివార్యమని తెలుగు వన్ మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నది. అదే ఇప్పుడు జరగబోతున్నది. ఏపీలో ముందస్తు ముచ్చటే లేదని ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు తమ నాయకుడు జగన్ మదిలో ముందస్తు ఆలోచన మెదులుతోందని అంగీకరిస్తున్నారు. ఏడాది ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పార్టీ అంతర్గత సంభాషణల్లోనో.. లేదా మిత్రులతో పిచ్చాపాటీ మాట్లల్లోనో ఎవరో మాట్లాడుకోవడం కాదు.. సాక్షాత్తూ ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డే ఈ మాట చప్పారు. పైగా అక్కడా ఇక్కడా కాదు ఏకంగా మీడియా సమావేశంలోనే జగన్ ముందస్తు యోచన చేస్తున్నారనీ, ఏడాది, ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖాయమని సజ్జల చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జగన్ సర్కార్ కు ముందస్తుకు వెళ్లడం వినా మరో మార్గం లేదని తెలుగు వన్ ముందుగానే చెప్పింది. ఉచిత పథకాలతో ఇంత కాలం నెట్టుకొచ్చిన జగన్ కు ఇక ముందు వాటిని కొనసాగించే పరిస్థితి లేకపోవడం, ఇప్పటికే ప్రజలలో తమ ప్రభుత్వ తీరు పట్ల అసహనం పెరిగిన నేపథ్యంలో ఉచితాలు కూడా కొనసాగించలేని పరిస్థితి వస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ ఉచితాలు కొనసాగుతుండగానే ముందస్తుకు వెళ్లి ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది ఆయన యోచన అని తెలుగువన్ ముందుగానే అంచనా వేసింది. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు యోచన వాస్తవమేనని చెప్పడంతో తెలుగువన్ చెప్పిందే జరుగుతోందని తేలిపోయింది. పూర్తి కాలం జగన్ సర్కార్ అధికారంలో కొనసాగాలని భావిస్తే రెండేళ్ల తరువాత ఎన్నికలు వస్తాయి. అయితే అంత కాలం పాటు జగన్ కు ఉచితాలు కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్లి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారమైతే.. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరిగేలా జగన్ ముందస్తు ప్రణాళిక ఉండే అవకాశాలున్నాయి. అలా అయితే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో పాటు, ఉచిత పథకాలు కూడా పని చేసి తనకు విజయావకాశాలు మురుగౌతాయని జగన్ భావిస్తున్నారు. \ఒక వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ముందస్తుకు వెళ్లాలని భావిస్తే వచ్చే ఏడాది ప్రధమార్థంలో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏపీలో కూడా నిర్దిష్ట గడువు కంటే ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ముందస్తు సంకేతాలు ఇవ్వడం సజ్జల మీడియా సమావేశంతోనే మొదలు కాలేదు. గత కొద్ది కాలంగా ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులూ కూడా అడిగిన వారికీ, అడగని వారకీ ముందస్తు ప్రశక్తే లేదంటూ చెప్పడం కూడా ముందస్తు సంకేతాలిచ్చే ఉద్దేశంతోనే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక విపక్ష తెలుగుదేశం కూడా పాలనా వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థతిని బేరిజు వేసి చూస్తే జగన్ ముందస్తుకు వెళ్లడం ఖాయమనే చెబుతూ వస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు నెలల ముందే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతారన్న అంచనాతోనే తెలుగుదేశం తన దూకుడును పెంచింది. మొత్తం మీద ఏపీలో వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కంటే ఏడాది, ఏడాదిన్నర ముందుగానే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-opt-for-early-elections-39-135539.html





