ఏక కాలంలో తెరాస, బీజేపీలపై యుద్ధం: తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ దిశా నిర్దేశం
Publish Date:May 7, 2022
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వరంగల్ లో శుక్రవారం జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న పలు సందేహాలు, అనుమానాలు, శంకలకు సమాధానం ఇచ్చి వాటిని పటాపంచలు చేసేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ స్టాండ్ ఏమిటన్నది కూడా విస్పష్టంగా ప్రకటించేశారు. వచ్చే ఏన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కుండబద్దలు కొట్టేశారు. ఇందుకు భిన్నమైన ఆలోచన చేసే వారు ఎంతటి వారైనా సరే కాంగ్రెస్ కు అవసరం లేదనీ, ఆ పార్టీలతో లాలూచీ పడేవారిని ఉపేక్షించబోమనీ, పార్టీ నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని తేల్చేశారు. గత కొద్ది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో తెరాస, కాంగ్రెస్ ల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందన్న అనుమానాలు నెలకొని ఉన్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతోనూ. ఇటు తెరాస అధినేత కేసీఆర్ తోనూ వరుస బేటీలు జరపడమే ఈ అనుమానాలకు కారణం. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలంటే బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావడమొక్కటే మార్గమని చెబుతూ వస్తున్న ప్రశాంత్ కిశోర్ ఏదో ఒక విధంగా రెండు పార్టీల మధ్యా డీల్ కుదిర్చే అవకాశాలున్నాయా అన్న అనుమాలతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ఒక కన్ఫ్యూజన్ లో కూరుకుపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి వారు అటువంటి అవకాశాలు లేవని గట్టిగా చెప్పినప్పటికీ ఆ అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. రాహుల్ గాంధీ తన విస్పష్ట ప్రకటనతో వాటన్నిటినీ నివృత్తి చేసేశారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికల సమరానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా రైతు సంఘర్షణ సభ నిర్వహణ జరిగిందనడంలో సందేహం లేదు. సభ లక్ష్యం పూర్తిగా నెరవేరిందనే చెప్పాలి. బీజేపీ, తెరాస రెండూ ఒకటేననీ, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన పార్టీలేననీ రాహుల్ ఉద్ఘాటించి రెంటితో ఏకకాలంలో పోరాటం చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. తెరాస ఫ్లాగ్ షిప్ పథకాలుగా చెప్పుకునే ఓ రెండు అంశాలు లక్ష్యంగా ఆ పార్టీపై రణభేరి మోగించింది కాంగ్రెస్. వాటిలో ఒకటి ధరణి పోర్టల్ కాగా, రెండోది రుణమాఫి. ఈ రెండూ కూడా ప్రచారార్భాటంతో ప్రజలలోకి వెళ్లి, ఆచరణలో విఫలం అయినవే కావడం గమనార్హం. రైతు సంఘర్షణ సభ వేదికగా టీపీసీసీ చీఫ్ ఆ రెంటిపైనా విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి వాగ్దానం చేశారు. ఇవి రెండూ కూడా రైతులకు స్వాంతన పరి చేవే. కౌలు రైతునూ ఆదుకుంటామని ప్రకటించడం ద్వారా అంతరాలు లేకుండా రైతులందరినీ ఆదుకుంటామని చెప్పారు. చారిత్రాత్మకం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించి వరంగల్ డిక్లరేషన్ కేవలం డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ హామీ పత్రం అని ప్రకటించడం ద్వారా డిక్లరేషన్ లో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న భరోసాను రాహుల్ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే గతానికి భిన్నంగా రాహుల్ ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంతో సాగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందన్న రాహుల్ తెలంగాణకు అన్యాయం చేసిన, చేస్తున్న టీఆర్ఎస్ తో కలిసే ప్రశక్తే లేదని ప్రకటించి, ఇకపై ఈ ప్రశ్న ఎవరడిగినా, అలా అడిగిన వారు ఎంత పెద్ద నాయకుడైనా సహించేది లేదనీ, బహిష్కరించడం ఖాయమనీ హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు పొందడానికి అర్హతేమిటో కూడా రాహుల్ ఈ సభ ద్వారా క్యాడరు స్పష్టం చేశారు. పార్టీ కోస, ప్రజల కోసం పని చేసే వారికే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తామని వరంగల్ సభ వేదికగా ప్రకటించేశారు. మొత్తంగా వరంగల్ సభ ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్న కన్ఫ్యూజన్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని చెప్పకనే చెప్పేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఒంటరిగానే పోరాడుతుందని తేల్చేశారు.
http://www.teluguone.com/news/content/rahul-declars-fight-against-trs-and-bjp-at-a-itme-39-135543.html





