అనంతలో దూసుకొస్తున్న టీడీపీ యువ కెరటం పరిటాల శ్రీరామ్
Publish Date:May 6, 2022
Advertisement
ఏపీ రాజకీయ చరిత్రలో పరిటాల రవి కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది. అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని ముద్ర ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ‘పరిటాల కుటుంబం మాటే శాసనం’ అన్నట్లు ఉంటుంది. ఆ కుటుంబం అధికారంలో ఉన్నా.. లేకపోయినా పరిటాల ఫ్యామిలీ మాటే ఫైనల్ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఓ యువ కెరటం దూసుకొచ్చింది. ఆ యువ కెరటమే పరిటాల శ్రీరామ్. మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర (రవి), మాజీ మంత్రి సునీత దంపతుల కొడుకు శ్రీరామ్. ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ చార్జిగా పార్టీ బాధ్యతల్ని ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తున్నారీ యువనేత శ్రీరామ్. పరిటాల రవి, సునీత దంపతుల వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శ్రీరామ్ గత ఎన్నికల్లో రాప్తాడులో టీడీపీ అభ్యర్థిగా ఓటమి చవిచూశారు. ఓడినప్పటికీ రాప్తాడు టీడీపీపై పరిటాల శ్రీరామ్ పట్టు ఏమాత్రం తగ్గలేదంటే ఆశ్చర్యంలేదు. రాప్తాడు టీడీపీ శ్రేణులకు శ్రీరామ్ ఎంత చెబితే అంత అనే టాక్ ఉంది. తన కుటుంబం నుంచి సహజంగా పుణికిపుచ్చుకున్న రాజకీయ చైతన్యంతో పాటు ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి ముందుంటారు. పరిటాల శ్రీరామ్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో చక్కని అనుబంధం ఉంది. టీడీపీలో శ్రీరామ్ మంచి నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు శ్రీరామ్ రెడీ అవుతున్నారు. తాను చెబితే పార్టీ అధినేత చెప్పినట్లే అనేలా ధర్మవరంలో దూసుకుపోతున్నారు శ్రీరామ్. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో ఢీకొట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ సర్కార్ పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కష్టాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ధర్మవరంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణ కమలం గూటిలో చేరడంతో టీడీపీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ ఓ టార్చ్ బేరర్ లా నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు. అయోమయంలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జనం నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ లీడర్ శ్రీరామ్ జోరు పెంచారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. పంచ్ డైలాగ్ లతో టీడీపీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. ఆయన ప్రసంగాలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. శ్రీరామ్ జోష్ చూసిన టీడీపీ అధినేత ధర్మవరం పార్టీ బాధ్యతలు అప్పగించడం విశేషం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ ధర్మవరానికి నియోజకవర్గం నేతలు తెచ్చుకున్నారంటే.. శ్రీరామ్ పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతోంది. ధర్మవరంలో ఆయన మంచి పునాదినే వేసుకున్నారనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసాగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా శ్రీరామ్ తప్పకుండా హాజరై అందరికీ తలలో నాలుకలా మెలుగుతున్నారు. తరచూ పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా శ్రీరామ్ మరింత యాక్టివ్ గా పనిచేయడం అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. ప్రజలకు కూరగాయల పంపిణీ, భోజనం ఏర్పాట్లు చేయడం, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు అందజేసి శెభాష్ అనిపించుకున్నారు. సీఎం జగన్ కు ఎదురొడ్డి నిలిచేందుకు కూడా శ్రీరామ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సీమలో దివంగత పరిటాల రవి ఇమేజ్ ను కాపాడుతూనే జిల్లా రాజకీయాల్లో తన మార్క్ కనబరుస్తున్నారు. జిల్లాల పునర్విభజన వెనుక జగన్ రెడ్డి రాజకీయ కుట్ర ఉందని, ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేయడానికి నిరసనగా నిరాహార దీక్షచేశారు. ధర్మవరం రెవన్యూ డివిజన్ రద్దు వల్ల 8 మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో జేసీ వర్గానికి, పరిటాల వర్గానికి దశాబ్దాల శత్రుత్వం ఉంది. అలాంటి శత్రువర్గంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా కౌగలించుకునేట్టుగా ఆకర్షించడం శ్రీరామ్ ఇమేజ్ కు తార్కాణం అంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ సామాజిక, రాజకీయ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి 40 శాతం సీట్లు యువతకే ఇస్తానని పార్టీ అధినేత ప్రకటించడం పరిటాల శ్రీరామ్ కు కలిసి వచ్చే అంశం అంటున్నారు. శ్రీరామ్ కు ధర్మవరం టీడీపీ టికెట్ వస్తే.. అతని గెలుపు నల్లేరు మీద నడక అవుతుందనేది స్థానికుల అంచనా. పోరాటాల రవన్న కుమారుడు.. రాజకీయాల్లో మంచి దూకుడు ప్రదర్శిస్తున్న శ్రీరామ్ ధర్మవరం నుంచి జెండా ఎగరేయడం ఖాయం అంటున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-youth-leader-paritala-sriram-39-135531.html





