బర్త్‌డే సందర్భంగా అన్నా కొణిదెల ఉదారత...!
Publish Date:Aug 1, 2026
Advertisement
పుట్టినరోజు వేళ పవన్ సతీమణి గొప్ప నిర్ణయం..విశాఖ జూ సంరక్షణకు భారీ విరాళం..! ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ ధ్యేయంగా విశాఖపట్నంలోని ప్రముఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో రెండు అరుదైన జీవులను ఏడాది పాటు దత్తత తీసుకుని తన ఉదారతను చాటుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలను విలాసవంతంగా కాకుండా పర్యావరణ, జీవరాశుల రక్షణకు ఉపయోగపడేలా నిర్వహించాలని అన్నా కొణిదెల భావించారు. ఇందులో భాగంగా విశాఖ జూలో నివసిస్తున్న ఆసియాటిక్ ఏనుగుతో పాటు ఒక రాయల్ బెంగాల్ టైగర్‌ను ఏడాది కాల పరిమితికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ జీవుల సమగ్ర సంరక్షణ, రోజువారీ పోషణ మరియు వైద్య సేవలకు అయ్యే వ్యయం నిమిత్తం మొత్తం రూ. 6.30 లక్షల విలువైన చెక్కును జూ యాజమాన్యానికి అందజేశారు. ఇందులో ఆసియాటిక్ ఏనుగు సంరక్షణకు రూ. 4.30 లక్షలు, రాయల్ బెంగాల్ టైగర్ పోషణకు రూ. 2 లక్షలు కేటాయించారు. అన్నా కొణిదెల ప్రతినిధుల నుంచి ఈ విరాళాన్ని స్వీకరించిన విశాఖ జూ క్యూరేటర్ డాక్టర్ జి. మంగమ్మ, వారికి అధికారిక జంతు దత్తత ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. అందివచ్చిన ఈ ఆర్థిక సహాయాన్ని సదరు జంతువుల ఆరోగ్య సంరక్షణకు, నాణ్యమైన ఆహార సరఫరాకు సమర్థవంతంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత వేడుకల సందర్భంగా వన్యప్రపంచం పట్ల ఇలాంటి ప్రేమానురాగాలు చూపడం ఎంతో ప్రశంసనీయమని జూ అధికారులు కొనియాడారు. అన్నా కొణిదెల తీసుకున్న ఈ అడుగు సమాజంలో పర్యావరణ స్పృహను పెంచడంతో పాటు మిగిలిన వారికి కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూ యాజమాన్యం ప్రజలకు, కార్పొరేట్ సంస్థలకు కీలక పిలుపునిచ్చింది. జూలోని జంతువులను దత్తత తీసుకోవడం ద్వారా వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చునని తెలిపారు. ఇలా విరాళాలు ఇచ్చే దాతలకు ఆదాయపు పన్ను చట్టం 80G(5) కింద మినహాయింపులు లభిస్తాయని, దత్తత దాతల పేర్లను జంతువుల ఎన్‌క్లోజర్ల వద్ద ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం సతిమణిగా సామాజిక స్పృహతో అన్నా కొణిదెల తీసుకున్న ఈ ఆదర్శవంతమైన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో పర్యావరణ ప్రేమికులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఇదే బాటలో నడిచి మరెన్నో జంతువుల దత్తతకు ముందుకు వస్తారని విశాఖ జూ అధికారులు ఆశిస్తున్నారు. Anna Konidela, Pawan Kalyan, Visakhapatnam Zoo, Animal Adoption, Wildlife Conservation,
Indira Gandhi Zoological Park
http://www.teluguone.com/news/content/anna-konidela-36-227714.html





