బేడీలు వేయాల్సిన చేతుల నుంచి బొకేలు!.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
Publish Date:Apr 5, 2022
Advertisement
ఈ ఫోటోలో మార్క్ చేసి ఉన్న వ్యక్తి మామూలోడు కాదు. ఈ వైసీపీ ప్రముఖుడు.. ఇటీవల ఓ బాలికపై అత్యా-చార ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కిడ్నాప్, రేప్ కేసులో ఇతనిపై ఎస్సీ కమీషన్‌లో ఫిర్యాదు కూడా ఉంది. అలాంటిది.. అఘాయిత్యం కేసులో ఆరోపణలు ఉన్న ఏపీ ఆఫ్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబు.. ఇలా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి పూలబొకే ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి డీజీపీని కలవడం.. పోలీస్ బాస్ సైతం ఆయన్ను ఆప్యాయంగా స్వాగతించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఫోటోన్ ట్వీట్ చేస్తూ టీడీపీ నేత అనిత.. నేరుగా ఏపీ డీజీపీని ప్రశ్నించడం సంచలనంగా మారింది. బేడీలు వేయాల్సిన చేతుల నుండి బొకేలు స్వీకరిస్తున్నారు? ఇందుకే ప్రజలకు నమ్మకం పోతుంది. కిడ్నాప్, రేప్ కేసులో మీపై నమ్మకం లేకనే బాలిక తల్లిదండ్రులు SC/ST కమీషన్ లో ఇతగాడిపై ఫిర్యాదు చేస్తే మీరు ఇతడితో ఇలా ఫోటోలు దిగుతూ సభ్య సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నారు @dgpapofficial గారు?... అంటూ వంగలపూడి అనిత ట్విటర్‌లో ప్రశ్నించారు. ఇంతకీ ఎవరీ అనిల్‌బాబు? అతనిపై ఉన్న ఆరోపణ ఏంటి? గుంటూరుకు చెందిన ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఏపీ ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్-ఆఫ్కాఫ్ ఛైర్మన్ కొండూరు అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను అనిల్.. ఆయన గెస్ట్‌హౌజ్‌లు, ఇంటికి తీసుకెళ్లి అత్యా-చారం చేశాడని ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించటంతో తన కుమార్తె భయపడి, విచారణ సమయంలో ఆయన పేరు చెప్పలేదని ఇటీవల ఎస్సీ కమిషన్‌కు చెప్పారు. దీనిపై కమిషన్ విచారణకు ఆదేశించింది. గతంలో ఆ బాలిక కోర్టు, పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ ప్రధాన అనుచరుడు కన్నా భూశంకర్ ఉండటంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అనిల్‌బాబు ఉన్నారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడం మరింత కలకలం రేపింది. బాలికపై అత్యాచారం కేసులో మరికొందరు ఉన్నారని బాలిక తండ్రి తనకు వినతిపత్రం అందజేశారని, దీనిపై విచారణ చేపట్టాలని గుంటూరు పోలీసులను ఆదేశించినట్టు ఇప్పటికే ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. ఏడాది క్రితం బాధిత బాలిక, ఆమె తల్లి కరోనా సోకి గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. తల్లి మృతిచెందగా బాలిక కోలుకుంది. ఈ క్రమంలో ఓ మహిళ తాను ఇక్కడ నర్సుగా పనిచేస్తున్నానని బాలిక తండ్రిని పరిచయం చేసుకుంది. బాలికకు భవిష్యత్‌లో కరోనా రాకుండా నాటు వైద్యం చేయిస్తానని ఇంటికి తీసుకెళ్లింది. కొన్నిరోజుల తర్వాత బలవంతంగా వ్యభి-చార కూపంలోకి లాగింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి వ్యభి-చారం చేయించింది. తన కుమార్తె కనిపించటం లేదని ఆమె తండ్రి గతేడాది డిసెంబరులో మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు మూడు నెలల క్రితం ఆమె చెర నుంచి తప్పించుకుని గుంటూరు శివారు పేరేచర్లలో ఉంటున్న తండ్రి దగ్గరకు చేరుకుంది బాధిత బాలిక. జరిగిన విషయం తండ్రికి చెప్పటంతో మేడికొండూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలికకు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లిన మహిళ అరండల్‌పేట స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. మైనర్ బాలికపై అత్యా-చారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఉమెన్ ట్రాఫికింగ్, పోక్సో తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 66 మందిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు. ఈ కేసులో కీలక నిందితుడంటూ నెల్లూరుకు చెందిన వైసీపీ నేత కొండూరు అనిల్‌బాబుపై బాధిత బాలిక తండ్రి ఇటీవల ఎస్సీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. అలా బాలికపై అత్యా-చార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అనిల్‌బాబునే.. ఇప్పుడిలా నేరుగా ఏపీ డీజీపీ కసిరెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఫోటోలతో.. ఇక బాధిత కుటుంబానికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తోంది టీడీపీ. వైసీపీ నేతల అరాచకాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ నిలదీస్తోంది.
http://www.teluguone.com/news/content/anitha-fire-on-anil-babu-and-ap-dgp-39-133963.html





