సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్.. భారీగా ఆస్తులు సీజ్.. నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్!?
Publish Date:Apr 5, 2022
Advertisement
సంజయ్ రౌత్. శివసేన ఎంపీ. ఫైర్‌బ్రాండ్ లీడర్. సామ్నా సంపాదకుడు. నిత్యం బీజేపీని, మోదీని చీల్చి చెండాడే మరాఠా నాయకుడు. కేంద్రంపై గొంతెత్తితే.. ఢిల్లీని నిలదీస్తే.. గల్లా పట్టి ప్రశ్నిస్తే.. ఏమవుతుందో తెలుసుగా.. మహారాష్ట్రలో అదే జరుగుతోంది. సంజయ్ రౌత్‌పై ఈడీ అటాక్స్ సంచలనంగా మారింది. వెయ్యి కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సంజయ్ రౌత్, ఆయన కుటుంబానికి సంబంధించిన అలీబాగ్‌లోని 8 స్థలాలు, ముంబై-దాదర్ సబర్బన్‌లో ఓ ఫ్లాట్‌ను అటాచ్ చేసింది ఈడీ. రూ.1,034 కోట్ల విలువైన భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఆయనకు చెందిన ఆస్తుల్ని స్తంభింపజేసినట్టు తెలిపింది. ఇదే కేసులో మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ రౌత్‌ను ఫిబ్రవరిలోనే అరెస్టు చేసిన ఈడీ అధికారులు.. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. తాజాగా సంజయ్ రౌత్ విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడం కలకలం రేపుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎపిసోడ్ తెలంగాణలోనూ ప్రకంపణలు సృష్టిస్తోంది. త్వరలోనే కేసీఆర్ కుటుంబంపైనా ఈడీ యాక్షన్ ఉండనుందంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ అవినీతిపై ఆధారాలు సేకరించామని.. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమంటూ పక్కాగా చెబుతున్నారు. ఇటీవల కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌పై జరిగిన ఐటీ రైడ్స్ లింకులతో కేసీఆర్-కేటీఆర్-కవిత-సంతోష్‌ల డొంక కదులుతున్నట్టు తెలుస్తోంది. పక్కా సాక్షాలు దొరికాయని.. త్వరలోనే బిగ్ షిఫ్‌లపై ఈడీ రైడ్స్ జరుగుతాయని కమలదళం గట్టిగా చెబుతోంది. ఇటీవలే ముంబైలో కేసీఆర్- ఠాక్రేలు భేటీ జరిపి.. శివసేన-టీఆర్ఎస్‌లు భవిష్యత్తులో మోదీ-బీజేపీలపై గట్టిపై పోరాడాలని నిర్ణయించారు. పిడికిలి ఎత్తి మరీ కేంద్రంపై నగారా మోగించారు. కట్ చేస్తే, బీజేపీ-మోదీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడే సంజయ్ రౌత్‌కు చెందిన వెయ్యి కోట్ల ఆస్తులు అటాచ్ చేయడంతో.. ఇక నెక్ట్స్ కేసీఆర్ అండ్ కో పైనా ఇలానే ఈడీ అటాక్స్ తప్పవంటూ అంటున్నారు కమలనాథులు. ఆ విషయం తెలిసే కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ఆపసోపాలు పడుతున్నారని కూడా చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ed-shock-to-shiv-sena-mp-sanjay-raut-39-133958.html





