ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల ఒప్పందాల వరద
Publish Date:Jan 13, 2012
Advertisement
హైదరాబాద్:భారత స్థూల జాతీయోత్పత్తిలో (జిడిపి) ఉత్పత్తుల రంగం వాటా 16 శాతం ఉన్నదని,2022 నాటికి 25 శాతానికి పెంచడం లక్ష్యంగా భారీపెట్టుబడి, ఉత్పత్తి కారిడార్లు ఏర్పాటు చేయనున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు.హైదరాబాద్‌లో భాగస్వామ్య సదస్సు 2012ను ప్రారంభించిన సందర్భంగా కీలకోపన్యాసం ఇస్తూ దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఇలాంటివి ఏడు కారిడార్లు ఏర్పాటు కానున్నాయని, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు.'కొత్త తరానికి చెందిన నవ్యతకు పట్టం కట్టే భాగస్వామ్యాలు' అనే అంశంపై ఈ భాగస్వామ్య సదస్సును భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర వాణిజ్య శాఖ, రాష్ట్రప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.సంపన్న,పారిశ్రామిక దేశాల కూటమికి (జి-7) వర్థమాన దేశాలు వినూత్నమైన వ్యాపార భాగస్వామ్యాలతో సవాలు విసురుతున్నాయని ఆయన అన్నారు.
జిఎంఆర్ 33వేల కోట్ల పెట్టుబడి
జిఎంఆర్ ఇండస్ట్రీస్ 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.కాకినాడలో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు జిఎంఆర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎస్.జి.కిశోర్ తెలిపారు. ఐదేళ్లలో దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.మిగతా 3,000 కోట్ల రూపాయలతో కాకినాడ సీ పోర్ట్స్ సహకారంతో జిఎంఆర్ ఇన్ఫ్రా చేపట్టే పోర్టు ఆధారిత ఉత్పాదక పారిశ్రామిక వాడ రెండవదని ఆయన అన్నారు.ఇందులో భాగంగా పోర్టు మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు రిఫైనరీ, లాజిస్టిక్స్ కూడా నిర్మిస్తామని ఆయన చెప్పారు.
యశ్ బిర్లా గ్రూప్ 13 వేల కోట్ల పెట్టుబడి యశ్ బిర్లా గ్రూప్ రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు గ్రూప్ చైర్మన్ యశ్ బిర్లా తెలిపారు. రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్పోర్ట్స్ సిటీ, వెయ్యి కోట్ల పెట్టుబడితో ఆయుర్వేద విలేజ్ నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలోనే చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇది కాకుండా సోలార్ విద్యుత్ రంగానికి అవసరం అయినపాలీ సిలికాన్, సిలికాన్ వేఫర్లు, సోలార్ ఫొటో వోల్టాయిక్ సెల్స్, ప్యానెల్స్ తయారుచేసే యూనిట్ 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఒక పారిశ్రామిక సంస్థ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి తమదే అవుతుందని ఆయన అన్నారు.
30 వేల కోట్లతో విశాఖలో మరో రిఫైనరీ విశాఖపట్నం పిసిపిఐఆర్‌లో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రిఫైనరీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బిఆర్శెట్టి గ్రూప్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని గ్రూప్ చైర్మన్ శెట్టి తెలిపారు.
12 వేల కోట్లతో జివికె థర్మల్ ప్రాజెక్టు
రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండును తట్టుకునేందుకు 12 వేల కోట్ల రూపాయలతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు జివికె గ్రూప్ వైస్ చైర్మన్ సంజయ్‌రెడ్డి తెలిపారు. భాగస్వామ్య సదస్సు సందర్భంగా బిజినెస్ బ్యూరోతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు అవసరం అయిన బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు.తూర్పు గోదావరి జిల్లాలోని జేగురుపాడులో పని చేస్తున్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను కూడా 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నామని సంజయ్ చెప్పారు.ప్రభుత్వం అంచనావేస్తోన్న ఇన్వెస్ట్మెంట్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కేవలం విద్యుత్ రంగంలోనే ఉన్నాయి.
ఎల్ఎన్జి టెర్మినల్ నిర్మాణం కోసం 5,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వరంగంలోని గెయిల్ మరో ఓయుపై సంతకాలు చేసింది.
ఇది ఎక్కడ నిర్మించేది ఇంకా నిర్ణయించలేదు.ఈ కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయితే 50 వేలకు పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. పరోక్షంగా కనీసం నాలుగైదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-24-10926.html





