అనంతపురంలో కొనసాగుతున్న దేవదాసీ వ్యవస్థ
Publish Date:Feb 17, 2012
Advertisement
జిల్లాలో 2000 మంది దేవదాసీలు అనంతపురం: సమాజంలో ఎన్ని మార్పులు చోటుచేసుకున్నా, ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా అనంతపురం జిల్లాలో దేవదాసీ, మాతంగి, బసివినీ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 2000 మంది దేవదాసీ బాధితులు ఉన్నారు. కుల ఆచారం, ఆర్ధిక బలహీనతల కారణంగా అనేక కుటుంబాలు తమ పిల్లలను చిన్నప్పుడే దేవదాసీలుగా వదిలివేస్తున్నారు. వారికి మగదిక్కంటూ ఉండటం లేదు. సమాజంలో వారు చిన్నచూపుకు గురవుతున్నారు. వీరికి పుట్టిన పిల్లలు కూడా సమాజంలో తిరస్కారానికి, ఛీత్కారాలకు గురవుతున్నారు. వీరిని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తండ్రి ఎవరో, ఎవరి పేరు వ్రాయాలో తెలియక తల్లులు ఇబ్బందులకు గురవుతున్నారు. తండ్రిపేరు వ్రాయకపోవడం వల్ల అనేక మంది పిల్లలు పాఠశాలల్లో చేరలేకపోతున్నారు. వీరి సంక్షేమానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ దురాచారం మాత్రం అంతం కావడం లేదు. బాలికలను దేవదాసీలుగా మార్చిన వారిని శిక్షించడానికి కఠిన చట్టాలున్నాయి. అయితే ఈ చట్టం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం 2000 మంది దేవదాసీలు అనంతపురం జిల్లాలో ఉన్నారు. వీరిని ఆ వ్యవస్థలోకి తోసిన నేరస్తులపై జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా పెట్టలేకపోయింది. చట్టం ఎందుకూ పనికి రాదనడానికి ఇదే నిదర్శనం. గతంలో దేవదాసీలకు ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించింది. ఇప్పుడు అటువంటి సహాయం కూడా వారికి అందడం లేదు.
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం
http://www.teluguone.com/news/content/ananthapuram-24-11983.html





