యువరాజు ప్రయివేటు పాట
Publish Date:Aug 15, 2012
Advertisement
వారసత్వంతో అధికార పీఠం అలంకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న రాహుల్ గాంధీ గారి దృష్టిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రయివేటు పార్టీలేనట! 2014లో ప్రధాన మంత్రి పదవిని అలంకరిస్తారని అందరూ భావిస్తున్న రాహుల్ గాంధీని మన రాష్ట్రం నుంచి కొంత మంది బిసీ నేతలు వెళ్ళి కలుసుకున్నారట! రాబోయే ఎన్నికలలో బిసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేసారట! గత ఎన్నికల సమయంలో సామాజిక న్యాయం చేస్తామని చెప్పి పార్టీ ప్రారంభించి ఎన్నికల అనంతరం తన ప్రజారాజ్యాన్ని ‘‘చేతి’’ లో పెట్టి అధిష్ఠానం అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి అప్పటి తన పార్టీలో బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చారనీ, అలాగే తెలుగు దేశం పార్టీ కూడా బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించిందనీ, ఇప్పుడు వైఎస్ఆర్సిపి కూడా బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించనుందనీ వారు రాహుల్కు వివరించారట! అదంతా శ్రద్దగా విన్న రాహుల్ ఈ ప్రయివేటు కంపెనీల వల్ల బిసిలకు న్యాయం కలగదని చెప్పారంటూ రాయబారం మోసుకెళ్ళిన నేతలు మీడియాతో చెప్పారు. నిజమే...చేసినా చెయ్యకపోయినా చేసే ‘చెయ్యి’గా చెప్పుకోవడం యువరాజుకు వంశపారంపర్యంగా వచ్చిన వాక్చాతుర్యం అంటూ మన తెలుగు సోదరులు వ్యాఖ్యానిస్తున్నారు మరి!
http://www.teluguone.com/news/content/all-opposition-parties-are-private-parties-24-16547.html





