తిట్టిన నోటనే ప్రధానిని మళ్లీ పొగుడుతాడా!
Publish Date:Feb 3, 2022
Advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ ది ఓ పట్టాన అర్థం కాని స్టయిల్. అది నిజంగా ఓ స్టయిలా.. లేక అదే ఆయన స్టయిలా అన్న విషయంలో కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఫిబ్రవరి 5 (శనివారం) నాడు రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని మోడీ శంషాబాద్ కు వస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే వేదికను పంచుకుంటారు. రాష్ట్రంలో బీజేపీకి, అధికార టీఆర్ఎస్ కు వీరలెవల్లో వైరం నడుస్తున్న క్రమంలో మోడీ, కేసీఆర్ కలయిక ఎలా ఉంటుంది.. ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటారా.. ఎవరు ఎవరిని విష్ చేస్తారు... ఎవరు హుందాగా ప్రవర్తిస్తారు... ఎవరు ముభావంగా ఉంటారు.. అప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడాలన్నది తెలంగాణ ప్రజల్లో ఆసక్తి రేపుతున్న అంశం. అటు మిగతా అన్ని రాజకీయ పార్టీల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎదురేగి వెళ్లడం, అధికార లాంఛనాలతో రిసీవ్ చేసుకోవడం, ఆ తరువాత కలిసి విందారగించడం.. ఇదంతా కామన్. కానీ మొన్ననే ఫిబ్రవరి ఫస్టున నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ ఇంతెత్తు ఎగిరిపడ్డారు. బడ్జెట్లో తెలంగాణకు ఏం ఒరిగిందీ, ఏం జరిగిందీ, చెప్పే క్రమంలో అసలు విశ్లేషణ కన్నా కొసరుగా చేయాల్సిన విమర్శలే మోతాదుకు మించి, దారితప్పి వ్యక్తిగత తిట్ల పురాణం దాకా వెళ్లాయని రాజకీయ పార్టీల నేతలు, పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని మీద చేయాల్సిన విమర్శల స్థాయిని దాటి ఓ వ్యక్తిగా, ఓ గుజరాతీగా, పగటి వేషగాడిగా, మోసగాడిగా, నయవంచకుడిగా.. ఇంకా చాలా చాలా తిట్లే ప్రయోగించారు. బుద్ధి లేని ప్రధాని, మెదడు లేని ప్రధాని, సిగ్గు-శరం లేని ప్రధాని, దొంగ సోషల్ మీడియా పెట్టిన ప్రధాని, దొంగ ప్రచారం చేసే ప్రధాని, గుజరాత్ మోడల్ అంటే ఊపర్ షేర్వానీ-అందర్ పరేషానీ, పైన పటారం లోన లొటారం, వీళ్ల పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మతపిచ్చి లేపుడు, దాంతోని రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద పడి ఏడ్సుడు.. ఇది వీళ్ల రాజకీయం. రేకు డబ్బాల రాళ్లేసినట్టు లొడలొడ ఒర్రుడు తప్ప సిగ్గు శరం లేదు వీళ్లకు. ఎయిరిండియాను అమ్మినట్టు ఎల్ఐసీని గూడ అమ్ముతండ్రు. ఛీఛీ.. వీళ్లు ఓ దరిద్రం. ఈ దరిద్రపుగొట్టు పార్టీని కూకటివేళ్లతోని పీకి బంగాళాఖాతంల పడెయ్యాలె. పొగరు గూడ పెరిగింది. కండ్లు నెత్తికెక్కినై. దేశంల కురుచ బుద్ధి ఉన్న ప్రధాని మోడీ. నదుల అనుసంధానం ఓ బిగ్ జోక్.... నీ బొంద అనుసంధానం జేస్తవా... ఎట్ల జేస్తవయా.. నేనిచ్చిన అప్లికేషన్లు ఆడ (ముడ్డి కింద) పెట్టుకొని పంటడాట... కావేరికి కల్పుతడాట ఈ మొగోడు. మేం పండిచ్చే పంటే కొనే మొకం లేదు మీ తెలివికి. దిక్కుమాలిన పార్టీ, దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందెలు మీరు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడే రకం మీరు. 317 జీవో పేరు చెప్పి వచ్చేటోల్ల లాగులు పలగ్గొట్టాలని యువకులను కోరుతున్నా... మీరు పిచ్చికుక్కలు. మీరు మొరిగితే మేం ఊకుంటమా.. నీల్లల్ల ఫ్లయిట్ దిగి... ఓఓఓ నేను పీకిన, పొడ్శిన అని చెప్తడా... బెంగాల్ ఎలక్షన్ల గడ్డం పెంచుకొని రవీంద్రనాథ్ టాగూర్ లెక్క, తమిళనాడు ఎలక్షన్ల లుంగీ కట్టుకొని పోవాలె.. గీ బట్టలు మారిస్తే దేశం మార్తదా.. గీ ట్రిక్కుల మీద దేశాన్ని పరిపాలిస్తరా... ఇలా తిట్టిన తిట్టు తిట్టకుండా కాదు... తిట్టకూడని తిట్లు ఎన్నో వాడారని, ఇది తమ పార్టీకి ఇబ్బందికరమేనని స్వయంగా టీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు. అటు బీజేపీయేతర పక్షాలు కూడా కేసీఆర్ తిట్ల పురాణాన్ని అపరిపక్వమైన రివాజుగా అభివర్ణిస్తున్నారు. ఇదే కేసీఆర్... 2017లో ప్రధాని గజ్వేల్ కు మిషన్ భగీరథ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మోడీని అద్భుతమైన రీతిలో పొగిడారని గుర్తు చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా పరిపాలన సాగిస్తున్న తొలి భారత ప్రధాని అంటూ వీరభక్తుడి లెవల్లో కితాబిచ్చారు. దేశం ముందుకు వెళ్లాలంటే ఇలాంటి నాయకుడి డైరెక్షన్లోనే సాధ్యమవుతుందని హిందీలో ప్రధానికి అర్థమయ్యేలా మరీ ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఇప్పుడదే కేసీఆర్ నాలుగేళ్లు తిరిగేసరికి పూర్తి విరుద్ధంగా మాట్లాడడం ఏంటని రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రధానిని వ్యక్తిగతంగా చాలా నీచస్థాయిలో కామెంట్లు చేశాక ప్రధానితో డయాస్ పంచుకునే సందర్భం ఎలా ఉంటుందో చూడాలన్న ఆత్రుత అందరిలోనూ కనిపిస్తోంది. మరి నిజంగా 5వ తేదీ నాటి ఆ చరిత్రాత్మక దృశ్యం ఎలా ఉంటుందో చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/all-eyes-on-kcr-modi-dais-39-131199.html





