ఇసుకేస్తే రాలదు.. ఉద్యోగుల ఉప్పెన.. జగనన్న పతనం ఆరంభం!
Publish Date:Feb 3, 2022
Advertisement
ఈ ఫోటోలు ఓసారి చూడండి.. ఆ వీడియోలు ఓసారి చూడండి.. అది జనమా.. ప్రభంజనమా! ప్రభుత్వ ఉద్యోగులు చలిచీమల మాదిరి దండు కట్టారు. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వంపై దండయాత్ర చేపట్టారు. ఒక్కొక్కరిగా కదలి వచ్చారు. అంతా కలిసి ఒక్కటిగా నిలిచారు. కదం కదం.. జనం జనం.. చలో విజయవాడతో సర్కారుపై సమర శంఖం. బీఆర్‌టీఎస్ రోడ్డు మొత్తం జనమే జనం. ఆ మార్గమంతా కిక్కిరిసిపోయింది. ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. అంతా ఉద్యోగులే. అంతా స్వచ్చంధంగా తరలివచ్చిన వారే. ఎవరూ బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిళ్లు పంచలేదు. ఎవరూ బస్సులు పెట్టి తరలించలేదు. పోలీసులు అడ్డుకున్నా ఆగలేదు. ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు లొంగలేదు. ఖాకీల వార్నింగులకు చెదరలేదు. ఒకరో ఇద్దరో వస్తే అడ్డుకునేవారేమో. ఇలా ఉప్పెనలా పొటెత్తితే.. ఆ జనసంద్రాన్ని.. ఉద్యోగుల వెల్లువను ఆపతరమా? జగనన్నా.. చూస్తున్నావా? మీ సాక్షి టీవీ ఛానెల్ మార్చి.. ఓ సారి విజయవాడలో ఏం జరుగుతోందో ఓ లుక్కేయన్నా. వీళ్లేమీ మీ ఎన్నికల ప్రచారంలో మాదిరి డబ్బులిచ్చి తీసుకొచ్చిన జనాలు కాదన్నా. అంతా వేలకు వేలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులే. మీరు తీసుకొచ్చిన పీఆర్సీ పుణ్యాన.. ఇలా రోడ్డున పడ్డారు. జీతం కోతతో.. ఇలా తిరగబడ్డారు. తమ కడుపుమంటను.. మీ తాడేపల్లి ప్యాలెస్‌కు తాకేలా.. చలో విజయవాడతో ఇలా తరలివచ్చారు. మీ ప్రభుత్వంపై తిరుగుబాటుకు నాంది పలికారు. ఉద్యోగ సంఘాల నేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేనున్నాను.. నేను విన్నానన్న’’ సీఎం జగన్.. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమని విమర్శించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ తమను రోడ్డుపైకి ఈడ్చారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ‘‘మేం ఏపీలోనే ఉన్నాం.. పాకిస్థాన్‌లో కాదు.. అణచివేత తగదు’’ అని ఉద్యోగులు ఘోషించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోండి. ఉద్యోగుల న్యాయబద్ధ డిమాండ్లను నెరవేర్చండి. వారి జీతాలను దోచేసే కుట్రలు ఇక చాలించండి. చూశారుగా.. చలో విజయవాడతో ఈ జన ఉప్పెన. అందులో మీ ప్రభుత్వం కొట్టుకుపోకూడదు అంటే.. జగనన్నా.. దిగిరా.. లేదంటే.. ఉద్యోగులతో పెట్టుకుని బాగుపడిన ప్రభుత్వం ఉన్నట్టు చరిత్రలోనే లేదు. హిస్టరీ రిపీట్స్ కాకముందే.. పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకో. లేదంటే.. చూశారుగా ఉద్యోగుల దండయాత్ర. విజయవాడలో మోగిన రణగంట. ఖబడ్దార్.
http://www.teluguone.com/news/content/ap-employees-chalo-vijayawada-39-131194.html





