నాడు వర్షాభావం...నేడు వరద ప్రమాదం !
Publish Date:Aug 6, 2012
Advertisement
నిన్న మొన్నటి వరకూ నీళ్ళులేక వెలవెలబోయిన జలాశయా లన్నీ నేడు వరద నీటితో నిండుగా కనిపిస్తున్నాయి. సాగుకు అనుకూల వాతావరణం ఉంది కాబట్టి వరదకాలువలకు జలాశయాల్లోని గేట్లు ఎత్తివేయటం ద్వారా నీటిని వదులు తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నీటిని వదలలేదని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నీరు వదులుతామని ఇరిగేషన్ అథికారులు చెబుతున్నారు. విజయవాడ కృష్ణా బ్యారేజీలో 2200 క్యూసెక్కుల వరదనీరు చేరింది. బ్యారేజీలో 11 అడుగుల ఎత్తులో నీరు ఉంచి మిగతా నీటిని వరదకాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో సాగునీటి విడుదల వ్యవసాయానికి ఉపయోగ పడుతుందని అధికారులు చెబుతున్నారు. సీలేరు వద్ద గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంది.వరదనీటి ప్రవాహం పెరుగు తుండడంతో ఖమ్మం జిల్లా చింతూరు పల్లపుప్రాంతాల్లో ముందస్తుగా వరదనీటి ముంపును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. డొంకరాయి బాడవ నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేశారు. ఖమ్మం జిల్లా చర్ల వద్ద తాలిపేరు జలాశయంలో భారీగా వరదనీరు చేరింది. 18గేట్లు ఎత్తి 21వేల క్యూసెక్కల నీటిని గోదావరిలోకి వదిలారు. ఇలా వరద నీరు గోదావరిలోకి వదలటంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నది వరదనీటితో ఉధృతంగా పెరుగుతోంది. దీంతో పల్లపుప్రాంతాల్లో వరదనీటి ఉధృతి ప్రభావం పడకుండా కాలువలకు నీరు వదులుతున్నారు. ఒకవైపు వర్షపునీరు, మరోవైపు వరదనీరు వల్ల సాగుకు ఇబ్బంది లేకపోయినా నీరెక్కువయ్యి పంటనీటమునిగే ప్రమాదం మాత్రం తప్పలేదని రైతులు గగ్గోలు పెడుతున్నాడు. వ్యవసాయాథికారులు మాత్రం ఈ సీజన్లో సాగుకు ఢోకా ఉండదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/all-dams-are-full-of-rain-water-24-16287.html





