జోగు రామన్న మెజార్టీ పై జోరుగా బెట్టింగులు
Publish Date:Mar 20, 2012
Advertisement
ఆదిలాబాద్ ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. తరపున పోటీచేసిన జోగు రామన్న విజయం ఖాయమనే ధీమాను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే జోగు రామన్నకు వచ్చే మెజార్టీపై మాత్రం సందిగ్థత నెలకొంది. జోగు రామన్నకు కాంగ్రెస్ అభ్యర్థి సి.రామచంద్రారెడ్డి, టిడిపి అభ్యర్థి పాయల శంకర్ గట్టి పోటీనిచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ వచ్చినప్పటికీ జోగు రామన్న కనీసం 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జోగు రామన్న మెజార్టీపై ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 14 పర్యాయాలు ఎన్నికలు జరిగితే మూడుసార్లు టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడనుంచి అత్యధికంగా స్వతంత్రులే ఎన్నికకావడం విశేషం. గతంలో ఇక్కడ పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, సిపిఐ ఒకసారి గెలవగా, ఐదు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులే గెలుపొందారు. సి.రామచంద్రారెడ్డి 1978-1985లో స్వతంత్ర అభ్యర్థిగా, 1989-2004లో కాంగ్రెస్ తరపున మొత్తం నాలుగుసార్లు ఆదిలాబాద్ నుంచి గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టిడిపి నుంచి గెలిచిన జోగు రామన్న తొలిసారిగా చట్టసభలోకి వెళ్లగా రెండున్నరేళ్ళకే ఆయన పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈసారి టి.ఆర్.ఎస్. మొదటిసారిగా ఈ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని అసెంబ్లీకి పంపే అవకాశం కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/adilabad-former-mla-jogu-ramanna-24-12770.html





