ఏపీ సీఐడీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కర్మఫలం అనుభవించక తప్పదుగా?
Publish Date:Nov 6, 2024
Advertisement
జగన్ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తమ విధులను విస్మరించి ఏలిన వారి సేవలో తరించడమే పరమార్ధంగా భావించారు. జగన్ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో ఆయన మెప్పు కోసం నానా గడ్డీ కరిచారు. పనిలో పనిగా సొంత లబ్ధి కోసం అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదనకు తెరతీశారు. ఇప్పుడు జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. దీంతో వైసీపీ కార్యర్తల్లా వ్యవహరించిన అధికారులు జగన్ అండ చూసుకుని చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థతి ఏర్పడింది. ఇప్పటికే పలువురు అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. వారి పాపాలు, అకృత్యాలకు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పని పరిస్థితి ఎదురైంది. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు. ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్న సంజయ్ ఇప్పుడు కేసులు, విచారణలు ఎదుర్కొని కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితిలో ఉన్నారు. తాము అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా నడుచుకుని, వాళ్లు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా రెచ్చిపోయిన అధికారులంతా ఇప్పుడు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతామా అన్న భయంతో వణికి పోతున్నారు. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు. కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సంజయ్‌కి పోస్టింగ్ ఇవ్వలేదు. అంతే కాదు.. పలు అక్రమాల్లో అడ్డంగా దొరికిన ఆయనపై చర్యలకు ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది. సంజయ్ అక్రమాల చిట్టా మామూలుగా లేదు. వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు..చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. సంజయ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేసినప్పుడు..అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. ఆ విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మకై ఆ సంస్థకు అప్పనంగా చెల్లింపులు చేసినట్లు తేలింది. బిడ్డింగ్‌లో రిగ్గింగ్ చేయడంతో పాటు టెండర్లు కట్టబెట్టడంలో నిబంధనలను బేఖాతరు చేసినట్లు గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ విభాగం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సంజయ్‌పై కేంద్ర సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సమయంలో సంజయ్ ఆ శాఖలో ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. టెండర్లు, కాంపిటీటివ్ బిడ్లు లేకుండానే తన ఇష్టారీతిగా ఆర్డర్లు ఇచ్చేశారు. బిల్లులూ సబ్‌మిట్ చేయలేదు. వెబ్‌సైట్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, ట్యాబ్‌ల సరఫరా కోసం భారీగా బిల్లులు చెల్లించేశారు. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ తనకు తానుగా ఓ భారీ బాధ్యతను తీసుకున్న సంజయ్ అప్పటి జగన్ సర్కార్ నుంచి ఏకంగా కోటి రూపాయలు దండుకున్నారు. ఆ సొమ్ములో ఆయన ఎస్సీఎస్టీలకు చట్టాలపై అవగాహనా కార్యక్రమాలంటూ ఖర్చు చేసింది కేవలం మూడు లక్షల ర ూపాయలు మాత్రమే. ఈ విషయాలన్నీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చిన విషయాలే. ఇక తనను ఏరి కోరి సంజయ్ ను సీఐడీ చీఫ్ పిలిచి పీఠం ఎక్కించిన జగన్ మెప్పు కోసం ఆయన స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపిన సంగతి విదితమే. సరే అడ్డగోలుగా, కనీసం నోటీసు ఇవ్వకుండా, కారణం కూడా చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సంజయ్ వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టు సక్రమమే అని చెప్పేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి హస్తినలో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభుత్వోద్యోగిగా తన పరిమితులను కూడా ఆయన అధిగమించేశారు. ఇప్పుడు నాటి పాపాలకు శిక్ష అనుభవించడానికి ఎదురు చూస్తున్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ప్రకారం ఐపీఎస్ సంజయ్ పై చర్యలకు రంగం సిద్ధమైందంటున్నారు.
http://www.teluguone.com/news/content/action-ready-on-ap-cid-former-chief-sanjay-39-187991.html