సీఈసీపై అభిశంసన.. జగన్ స్టాండ్ ఏంటి?
Publish Date:Mar 15, 2026
Advertisement
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సీఈసీపై అభిశంసన విషయంలో జగన్ తీసుకునే స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత ఏన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణం అంటూ సమయం వచ్చినా, రాకున్నా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలబడుతుందా? అలా నిలబడే ధైర్యం చేస్తుందా? జగన్ కు ఆ దమ్ముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయనీ, అరకోటికి పైన ఓట్లపై స్పష్టత లేదనీ పలు విమర్శలు చేసింది. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రశ్నలు కూడా సంధించారు. ఇప్పుడు అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అన్న చర్చ జోరందుకుంది. ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన పార్టీగా ప్రజల ముందు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా పార్లమెంటులో వైసీపీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒరిగేదేం లేదు. కానీ తమ ఓటమికి ఈసీనే కారణమని వైసీపీకి నిజంగా నమ్ముతుంటే.. తీర్మానాన్ని బలపరచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తే.. ఆ పార్టీ విశ్వసనీయత పాతాళంలోకి దిగజారిపోవడం ఖాయం. సీఈసీపై అవిశ్వాస తీర్మానంపై ఇప్పటి వరకూ దాదాపు 195 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరైనా వైసీపీ ఎంపీ లేరు. దీంతో వైసీపీది ద్వంద్వ నీతి, నైతికతనీ నైతికత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేసుల భయంతో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణంగానే సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ ఎంపీలు నిలబడే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం కంటే.. జగన్ కు కేసుల నుంచి రక్షణ పొందడమే ముఖ్యమనీ, అందుకే వైసీపీ ఎంపీలు సీఈసీపై అవిశ్వాన తీర్మానంపై సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదనీ అంటున్నారు. రాజకీయవర్గాలలో వైసీపీ నైతిక పతనానికి దీనిని సంకేతంగా చూపుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి సీఈసీపై అవిశ్వాత తీర్మానం విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?
http://www.teluguone.com/news/content/what-is-jagan-stand-39-215524.html




