నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే..!
Publish Date:Jul 20, 2026
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన ఆమరణ నిరాహార దీక్షను అధికారికంగా విరమించారు. నీట్ (NEET-UG) పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 30 రోజులుగా ఈ శాంతియుత నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. ఈ ఉద్యమంలో భాగంగా సుదీర్ఘంగా 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, ఆరోగ్యం క్షీణించడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సామాజిక విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు అభిజిత్ దీప్కే తన నిరహార దీక్షను ముగించారు. వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో నిరసన వేదికపై నుంచి ఈ సందేశాన్ని ప్రకటించగా, అభిజిత్ నిమ్మరసం తాగి దీక్షను విరమించారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరసనకారులకు మరింత శక్తి అవసరమని, అందుకే దీక్షను విరమించి ప్రత్యక్ష పోరాటంలోకి దూకాలని వాంగ్‌చుక్ కోరడం గమనార్హం. దీక్ష విరమణ అనంతరం జంతర్ మంతర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరసనకారులు 'చలో సంసద్' (పార్లమెంట్ మార్చ్) పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రలో అభిజిత్ దీప్కేతో పాటు గీతాంజలి అంగ్మో మరియు నీట్ పరీక్ష అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రియా కుమారి తండ్రి కూడా పాల్గొన్నారు. దాదాపు 8000 మందికి పైగా విద్యార్థులు, యువత, మద్దతుదారులు ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు జంతర్ మంతర్ వద్దకు తరలివచ్చారు. "ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి" అంటూ నిరసనకారులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. గత కొన్ని ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ప్రదర్శనగా నిలుస్తుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి చర్చలకు మొగ్గు చూపింది. సిజెపి (CJP) ముఖ్య ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాతో భేటీ అయ్యేందుకు బయలుదేరారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్న విద్యార్థుల డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ప్రతినిధులు తేల్చి చెప్పారు. మరోవైపు, ఈ నిరసన మార్చ్ పార్లమెంట్‌కు చేరుకోకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా ఒక ఇనుప కోటలా మార్చేశారు. దాదాపు 32 కంపెనీల పారామిలట్రీ బలగాలను అంటే సుమారు 2000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా 5 ఢిల్లీ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. అదనంగా మరో 1400 మంది పోలీసులను రప్పించి బారికేడ్లను వెల్డింగ్ చేసి నిరసనకారులను అడ్డుకునేందుకు సర్వసన్నద్ధమయ్యారు. అయినప్పటికీ విద్యార్థి లోకం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తోంది. Abhijeet Dipke hunger strike, Jantar Mantar protest Delhi, Sonam Wangchuk fast CJP, Chalo Sansad march NEET, JP Nadda meeting student leaders, Delhi police security deployment
http://www.teluguone.com/news/content/abhijeet-dipke-hunger-strike-36-226525.html





