సుప్రీం గడపకు మళ్లీ స్పెక్ట్రమ్
Publish Date:Feb 12, 2012
Advertisement
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు తీర్పును పునఃసమీక్షించాలంటూ సుప్రీం కోర్టును కోరేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసి రివ్యూ పిటిషన్ దాఖలు చేయటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా అటార్నీ జనరల్ వాహనవతిని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదేశించినట్టు తెలిసింది. త్వరలోనే న్యాయశాఖ ఈమేరకు తగిన చర్యలు తీసుకుంటుంది. 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పువల్ల తలెత్తే పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, టెలికాం మంత్రి కపిల్ సిబల్, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, హోంమంత్రి చిదంబరం, టెలికాం కార్యదర్శి చంద్రశేఖర్, అటార్నీ జనరల్ వాహనవతి భేటీకి హాజరయ్యారు. సుప్రీమ్ కోర్టు తీర్పు వెలువడిన తరువాత ప్రధాని అటార్నీ జనరల్‌తో సమావేశమయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో సుప్రీం తీర్పువల్ల తలెత్తే వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించినట్టు టెలికాం మంత్రి కపిల్ సిబల్ మీడియాకు వెల్లడించారు. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. న్యాయస్థానం తీర్పు టెలికాం రంగంలో పెట్టుబడులపై విపరీత ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
2008లో మంజూరు చేసిన 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించిన పక్షంలో ఏం చేయాలి? ఎ.రాజా హయాంలో మంజూరైన 122 లైసెన్సులతోపాటు అంతకుముందు టాటా, భారతీ ఎయిర్ టెల్కు ఉచితంగా కేటాయించిన స్పెక్ట్రమ్‌పై ఏం చేయాలి? అన్న అంశంపై చర్చించినట్టు తెలిసింది. లైసెన్సుల కేటాయింపులో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రపైనా విచారణకు ఆదేశించాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ స్వామి తిరిగి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నందున దానిపై అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశంలో చర్చించినట్టు చెబుతున్నారు. తమకు లభించిన లైసెన్సులు రద్దుకావటంతో నార్వేకి చెందిన టెలినార్, రష్యాకు చెందిన సిస్టినా తాము పెట్టిన పెట్టుబడులకు భద్రత కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ రెండు సంస్థలు 26వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. సుప్రీం కోర్టు తీర్పును నాలుగు నెలల్లో ప్రభుత్వం అమలు చేయవలసి ఉన్నందున లైసెన్సులు రద్దు చేయాలన్న ఆదేశాలను త్వరలోనే ఆపరేటర్లకు పంపుతారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/2g-scam-24-11835.html





