2జి కేసు:సిబిఐ,ఇడిలకు సుప్రీం నోటీసులు
Publish Date:Jan 5, 2012
Advertisement
న్యూఢిల్లీ : 2జి స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ, ఎన్ఫోర్సు మెంట్ డైరెక్టరేట్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సార్, లూప్ వంటి కంపెనీలు, వాటి ప్రమోటర్లపై అవినీతి అభియోగాలు మోపకుండా ఎందుకు మెతకవైఖరి అవలంబిస్తున్నారంటూ ఆ రెండు సంస్థలను ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత కేంద్రమాజీమంత్రి దయానిధి మారన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని సిబిఐపై ఆరోపణలు వచ్చాయి. అలా ఎందుకు జరుగుతుందని జస్టిస్ జిఎస్ సింఘ్వీ, జస్టిస్ ఎకె గంగూలీలతో కూడిన ధర్మాసనం తమ నోటీసులో ప్రశ్నించింది. సిబిఐ డైరెక్టర్, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ల జోక్యంతో అవినీతి నిరోధక చట్టంకింద ఎస్సార్ గ్రూపు, దాని ప్రమోటర్లపై సిబిఐ చర్యలు తీసుకోరాదని నిర్ణయించుకున్నట్లు ఆరోపిస్తూ ఓ ఎన్‌జిఒ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఆ నోటీసులు పంపింది. మీపై వచ్చిన ఆరోపణలన్నింటికీ పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం సిబిఐ, ఇడిని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది. 2జి స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ, ఇడి వైఖరిపై ఆగ్రహం చెందిన ఒక ఎన్‌జిఒ సంస్థ సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్‌జిఒ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఎస్సార్, లూప్ వంటి పలు సంస్థలపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపరాదన్న సిబిఐ నిర్ణయం దర్యాప్తు అధికారి నివేదికకు పూర్తి భిన్నంగా వుందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఎస్సార్, లూప్ వంటి సంస్థలు అవినీతికి పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు వున్నాయని వాదించారు. దర్యాప్తు అధికారి విచారణలో వెల్లడైన వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఆ సంస్థలపై చర్యలు తీసుకోలేదని, కేసు నమోదు చేయలేదని ప్రశాంత్‌భూషణ్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/2g-case-24-10656.html





