అమ్మ ఒడికి 12 షరతులు.. ఎగ్గొట్టడమే జగనన్న వ్యూహమా?
Publish Date:Apr 15, 2022
Advertisement
మీ జిల్లా మారిందా? అయితే మీకు అమ్మ ఒడి రాకపోవచ్చు. మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తోందా? అయితే మీకు అమ్మ ఒడి ఇవ్వరు? మీ పిల్లలు బంధువుల ఇంట్లో ఉంటున్నారా? అయితే, మీరు అమ్మ ఒడికి అనర్హులు. ఆధారు కార్డు, బ్యాంక్ అకౌంట్, బియ్యం కార్డు.. ఇలా ఓ అరడజను షరతులు పెట్టారు జగనన్న. అందులో ఏ ఒక్కటీ సరిగ్గా లేకున్నా.. ఏమాత్రం తేడా ఉన్నా.. మీకు ఇవ్వాల్సిన 15వేలను ఎగ్గొట్టాలనేదే జగన్‌రెడ్డి స్కెచ్. ఆ మేరకు ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సాధ్యమైనంత మంది అర్హులను తగ్గించాలని.. ఉన్న లబ్దిదారులను తీసేయాలనే.. ఇలా తలాతోకా లేని షరతులు పెట్టారంటూ పేరెంట్స్ మండిపడుతున్నారు. డబ్బులు లేకనే ఇలా కొత్త కండిషన్లతో.. అమ్మ ఒడికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే ఓ అకాడమిక్ ఇయర్‌కు డబ్బులు ఇవ్వకుండా దాటేసిన జగన్ సర్కారు.. ఈసారి కొత్త రూల్స్‌తో అసలుకే ఎసరు పెట్టే కుట్ర చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా, తగ్గేదేలే అంటూ జగన్ సర్కారు అమ్మ ఒడి నిబంధనలను కఠిన తరం చేసేసింది. ఇప్పటి వరకూ ఆ షరతులు పాటించకుండా ఎవరైనా అమ్మ ఒడి డబ్బులు తీసుకొని ఉంటే.. వారిపై క్రిమినల్ కేసులూ పెట్టేందుకు సిద్ధమవుతుండటంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అధికారమే పరమావథిగా ఎంచి.. పాదయాత్ర సందర్భంగానూ, గత ఎన్నికల ప్రచారంలోనూ ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయానికి వచ్చేసరికి మల్లగుల్లాలు పడుతున్నారు. అన్ని నిబంధనలూ తుంగలో తొక్కి... కోర్టు అక్షింతలూ, మొట్టికాయలూ కూడా పట్టించుకోకుండా నిధుల మళ్లింపు ద్వారా హామీలు నెరవేర్చుకుంటున్నామని చెప్పుకోవడానికే అన్న చందంగా సంక్షేమ పథకాల అమలుతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే నియంత్రణ లేని, క్రమశిక్షణ పాటించని కారణంగా.. ఇప్పుడు వాటి అమలు ప్రభుత్వం మెడకు గుదిబండగా మారింది. దాంతో పథకాల లబ్ధిదారుల్లో ‘కోతల’ విధానాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగానే అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల చట్రంలో బిగించేసింది. అందరికీ అందుబాటులోకి విద్య అన్నమహత్తర ఆశయం అంటూ ఘనంగా ప్రారంభించిన అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల చట్రంలో బిగించేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ఎత్తుగడకు జగన్ సర్కార్ తెర లేపింది. ఒకటి కాదు...రెండు కాదు.. ఏకంగా 12 షరతులు విధించి వాటిని ఫుల్ ఫిల్ చేస్తేనే అమ్మ ఒడికి అర్హత లభిస్తుందని ఖరాఖండీగా తేల్చేసింది. పథకం ప్రారంభించినప్పుడు లేని షరతులు ఇప్పుడు కొత్తగా విధించడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించి.. తద్వారా భారం తగ్గించుకోవడమే తన ఉద్దేశమని జగన్ సర్కార్ చెప్పకనే చెప్పింది. ఆర్భాటంగా పథకాలు ప్రకటించడం.. అమలు చేయలేక కోతలు విధించడం వైకాపా సర్కార్ కు పరిపాటిగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో తాజాగా అమ్మఒడి పథకాన్ని ఆంక్షల చట్రంలో బిగించడమంటే లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించడమేనన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఇప్పటికే జనవరి నెలలో అమ్మల ఖాతాలో అమ్మ ఒడి పథకం కింద రూ. 14వేలు జమ కావల్సి ఉంది. వాస్తవంగా ఈ పథకం కింద లబ్ధిదారుల అక్కౌంట్ లో రూ.15వేలు జమకావాల్సి ఉన్నప్పటికీ ఆయాల వేతనం కింద వెయ్యి రూపాయలు మినహాయించుకుంటున్న సంగతి విదితమే. కానీ దానిని జులైకి వాయిదా వేసింది. అంటూ దాదాపు ఏడు నెలలు ఎగనామం పెట్టినట్లే అంటే ఒక విద్యా సంవత్సరం అమ్మఒడి నిధులు జమ కాలేదనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా విధించిన డజను షరతుల ఉద్దేశం ఒక అంచనా ప్రకారం పాతిక శాతం మంది లబ్ధిదారులను తగ్గించుకోవడమే. ఇందు కోసం జగన్ సర్కార్ విధించిన షరతులలో కొన్ని ఇప్పటికిప్పుడు పూర్తి చేయడం దాదాపు అసాధ్యమన్న భావన ఏర్పడుతోంది. కొత్తజిల్లాల వారీగా ఆధార్ కార్డును మార్పించుకోవడం, ఆధార్ బ్యాంకు అక్కౌంట్ అనుసంధానం, 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడకం వంటి షరతులు లబ్ధిదారుల్లో అయోమయాన్ని నింపడానికేనన్న విమర్శలు వినవస్తున్నాయి. అలాగే కొత్త బియ్యం కార్డు, బ్యాంకు తదితర వివరాలన్నీ వలంటీర్ వద్ద ఈ వివరాలన్నీ తనిఖీ చేయించుకోవడం వంటి షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో కోతే ప్రభుత్వ లక్ష్యం అన్నది తేటతెల్లమౌతున్నది. తల్లి, విద్యార్థి ఒకే ఇంట్లో ఉండాలి, బ్యాంకు అక్కౌంట్ రన్నింగ్ లో ఉండాలి, ఆదాయపన్ను చెల్లింపు దారులు అనర్హులు వంటి షరతులు, వీటిలో ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయినా... సదరు లబ్ధిదారు అమ్మ ఒడికి అనర్హతే. ఈ షరతులన్నీ పూర్తి చేసినా...ఇంటింటి సర్వే మ్యాప్ లో తల్లి, బిడ్డ ఒకే మ్యాపింగ్ లో ఉండాలి. అలాగే ఈ వివరాలన్నీ వలంటీర్ తో లబ్ధిదారే వలంటీర్ వద్ద తనిఖీ చేయించుకుని సరిచూసుకోవాలి. ఈ నిబంధనలన్నీ లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించి ప్రభుత్వం భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా విధించినవేనన్న విపక్షాల విమర్శలు చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/12-conditions-to-amma-odi-39-134439.html





