గౌతమ్‌కుమార్ గొంతు నొక్కేసిన ప్రభుత్వం?
Publish Date:Jul 6, 2012
Advertisement
రాష్ట్ర ప్రభుత్వం ఓ ఐపిఎస్ అథికారి గొంతునొక్కేసింది. డిజిపి స్థాయి నియామకంలో సీనియార్టీ తప్పారని కేంద్ర ట్రిబ్యునల్ (క్యాట్) ధృవీకరించినా తన తప్పును సరి చేసుకోలేదు. వారం రోజుల గడువు ఇచ్చినా క్యాట్‌ను తోసిరాజనిపించుకుంది. పైగా మనస్థాపంతో తాను పని చేయలేనని విఆర్ఎస్కు ధరఖాస్తు చేసుకున్న గౌతమ్‌కుమార్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా ముఖ్యమంత్రి విఆర్ఎస్ను ఆమోదించేశారు. అంతే కాకుండా కేంద్రానికి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదని మంజూరు సమయంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొనటం ఆయన ఆశ్రితపక్షపాతాన్ని చాటుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసలు రాష్ట్రప్రభుత్వం ఈయన విషయంలో ఎలా స్పందిస్తుందో చూద్దామని ఎదురుచూసిన వారికి తన శాసనసత్తాను సిఎం చాటుకున్నారు. దీంతో గౌతమ్‌కుమార్ విషయమై ఇంత వరకూ జోక్యం చేసుకోని పలు పోలీసు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తనను ఎవరు సవాల్ చేసినా సహించబోమన్న హెచ్చరిక సిఎం చర్యలో దాగి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత డిజిపి దినేష్‌రెడ్డి కన్నా తాను సీనియర్‌నని, తనకు అన్యాయం జరిగిందని ఐపిఎస్ అధికారి గౌతమ్‌కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ మొత్తం రికార్డులను పరిశీలించి రాష్ట్రప్రభుత్వం డిజిపి నియామకంలో తప్పు చేసిందని తేల్చింది. రికార్డుల పరిశీలన తరువాత ఈ విషయం తేల్చటంతో ఆగకుండా వారం రోజుల్లో రాష్ట్రప్రభుత్వం తన తప్పును సరి చేసుకోవాలని ఆదేశించింది. సర్వీసునిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించరాదన్న నీతిని రాష్ట్రప్రభుత్వానికి అర్థమయ్యేలా క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తోసిపుచ్చారు. తనకు కావాల్సిన డిజిపి దినేష్‌రెడ్డిని కాపాడుకోవాలని గౌతమ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చేందుకూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించబోయారు. అయితే ఈ విషయం ముందే పసిగట్టిన హోంశాఖా కార్యదర్శిగా ఉన్న గౌతమ్‌కుమార్ తనకు విఆర్ఎస్ ఇప్పించాలని ధరఖాస్తు చేసుకున్నారు. సిఎం దీన్ని ఆమోదించటం ద్వారా తన తప్పుకు నిజాయితీ రంగుపులుముకున్నారు. పైపెచ్చు కేంద్రానికి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పుడు గౌతమ్‌కుమార్‌కు జరిగినట్లే భవిష్యత్తులో తమకూ తప్పదా అన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి.
http://www.teluguone.com/news/content/-dgp-dinesh-reddy-24-15378.html





