రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.!
Publish Date:Nov 1, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై తుఫాను ప్రభావం, వర్షాలు, గాలుల తీవ్రత, జలాశయాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ముప్పు దృష్ట్యా రేపు చేపట్టాల్సిన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. అధికారుల అంచనాల ప్రకారం.. నవంబర్ 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. నవంబర్ 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన.! నవంబర్ 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడవచ్చని అంచనా. నవంబర్ 3, 4 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 5, బాపట్ల జిల్లాలో ఒక మండలం ఉన్నట్లు అంచనా వేశారు. నవంబర్ 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో 179 మిల్లీమీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వరదలు, విద్యుత్ అంతరాయాలపై అప్రమత్తం.! భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు వద్ద నవంబర్ 3న సుమారు 32,500 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర వాగులు, జలాశయాల పరిధిలోనూ భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. బలమైన గాలుల కారణంగా 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 వరకు విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయాలని, అవసరమైన పరికరాలు సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. అర్నబ్ తుఫాను నష్టంపై ఆరా.! ఇదిలా ఉండగా, గతంలో వచ్చిన అర్నబ్ తుఫాను కారణంగా జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యల పురోగతిని కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై చంద్రబాబు ఆరా తీశారు. ఆ రోజు రాత్రికల్లా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. తాజా తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. [ Andhra Pradesh Cyclone Alert, Cyclone Threat, CM Chandrababu Naidu, Bay of Bengal, Bapatla Coast, Heavy Rainfall, Weather Forecast, Budameru Flood, Andhra Pradesh Weather ]
http://www.teluguone.com/news/content/-andhra-pradesh-cyclone-alert-43-236007.html





