మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ హవా

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా సాగింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ విజయాలు సాధించింది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా.. నాలుగు మున్సిపాలిటీలు ముందే వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ నిలిచిపోయింది. మిగిలిన 11 కార్పొరేషన్లు 71 మున్సిపాలిటీలకు సంబంధించి లెక్కింపు జరగగా.. అన్ని  కార్పొరేషన్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మున్సిపాలిటీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ  కడప జిల్లా మెదుకూరులో టీడీపీ విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వైసీపీ స్వీప్ సాధించగా... టీడీపీ గెలిచిన రెండు మున్సిపాలిటీలు రాయలసీమలోనే ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయాలన్ని విశాఖ, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల చుట్టే తిరిగింది. ఈ ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉండటంతో వైసీపీ సవాల్ గా తీసుకుంది. సీఎం జగన్ ఈ మూడు కార్పొరేషన్లపై స్పెషల్ ఫోకస్ చేశారు. మంత్రులతో పాటు స్థానిక నేతలకు టార్గెట్ పెట్టారు. డబ్బులు కూడా భారీగా పంపిణి చేశారని చెబుతున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీకే ఆధిక్యత లభించింది. గుంటూరులో వైసీపీ ఘన విజయం సాధించగా.. విశాఖపట్నం. విజయవాడ కార్పొరేషన్ లో మాత్రం అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది టీడీపీ. వైసీపీ నేతలు భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా, ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేసినా... గట్టిగానే పోరాడింది. 
 
తమకు సవాల్ గా మారిన గుంటూరు, విజయవాడ, విశాఖలో గెలవడంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. మున్సిపల్ ఫలితాలతో    సీఎం జగన్ ప్రతిపాదిస్తున్న మూడు రాజధానులకు 
ఏపీ ప్రజలు మద్దతు ఇచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు, అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం.. స్థానిక సంస్థల ఎన్నికలను రాజధాని అంశంతో ముడిపెట్టడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇదే జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. రాజధాని వంటి అత్యంత కీలకమైన అంశంతో స్థానిక ఎన్నికల ఫలితాలను ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని రాజకీయ అనలిస్టులు చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను బెదిరించారనే ఆరోపణలు ముందు నుంచి వచ్చాయి. నామినేషన్ల సమయంలోనూ ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేయాలని భావించిన అభ్యర్థులను బెదిరించినట్లు ఆడియో, వీడియోలు బయటికి వచ్చాయి. రాయలసీమలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలకు సంబంధించిన చాలా వార్డులను పోటీ లేకుండానే వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. పోలింగ్ కు ముందు కూడా వాలంటీర్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించినట్లు చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఫించన్ కట్ చేస్తాం..అమ్మ ఒడి అపేస్తాం... రైతు సాయం నిలిపివేస్తాం.. రేషన్ కార్డు తీసేస్తాం ... ఇలాంటి బెదిరింపులకు దిగారని చెబుతున్నారు. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరించారని చెబుతున్నారు. ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేశారని, పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు సహకరించారని ఆరోపిస్తున్నారు.