బెదిరించారు.. గెలిచారు! తేల్చేసిన పీకే

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, ముసిపాల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కొస నుంచి ఈ కొన వరకు స్వీప్ చేసింది. విపక్షాలకు అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్లుగా దిష్టి చుక్కలే మిగిలాయి. అధికార పార్టీ అంతలా ఎలా స్వీప్ చేయగల్గింది? విపక్షాలు ఎందుకు అలా తుడిచిపెట్టుకు పోయాయి? ఏ అంశాలు అధికార పార్టీకి అండగా నిలిచాయి? ఏ అంశాలు విపక్షానికి ప్రతికూలంగా పనిచేశాయి? ఎన్నికలు ఎలా జరిగాయి? ఇలా అనేక కోణాల్లో ఎన్నికల ఫలితాలను విశ్లేశిన్చుకోవచ్చును. రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు,మేథావులు, మీడియా ఆ పని ఎటూ చేస్తాయి. 

20 నెలల, అరాచక పాలన (ప్రతిపక్షాల దృష్టిలో) తర్వాత కూడా అధికార పార్టీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం తీసీపోనీ విధంగా, అంతకంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించింది.ఇది అందరూ ఆమోదించవలసిన వాస్తవం. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఎలాంటి అద్భుతాలు ఆశించారో ఏమో కానీ, వైసీపీ విజయాన్ని, ‘బెదిరించారు గెలిచారు’ అంటూ  చాలా తేలిగ్గా  తీసి పారేశారు. 

ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని , కడుపు మీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి వైకాపా విజయం సాధించిందే కానీ, భరోసా  ఇచ్చికాదని అన్నారు. పవన్ ఆరోపణలలో చాలావరకు నిజం ఉంది , కానీ, అదే సమయంలో జనసేన, బీజేపీ కూటమి సహా ప్రతిపక్షాలు ప్రజల నాడి పట్టుకోలేక పోయారు.అది నిజం . గెలుపును పంచుకోవడంలో సెలెబ్రేట్ చేసుకోవడంలో కాదు,ఓటమిని హుందాగా తీసుకోవడంలోనే  నాయకుడి గౌరవం పెరుగుతుంది.