ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు?

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ను విచారించారు. సుదీర్ఘంగా దాదాపు ఏడు గంటల పాటు దానకిశోర్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన విచారణ సందర్భంగా వెల్లడించిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

దాన కిశోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో  మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశలు ఉన్నాయని చెబుతున్నారు.   ఫార్ములా ఈ-రేస్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి దానకిషోర్ ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు సమర్పించారు.  అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి  కేటీఆర్‌ ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ నుంచి నిధులు బదిలీ అయినట్టు దానకిశోర్ ప్రభుత్వానికి వెల్లడించిన సంగతి విదితమే. ఇక ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను పేర్కొన్న సంగతి విదితమే. ఇలా ఉండగా ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఫార్ములా ఈ రేస్ విషయంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలసిందే. ఈడీ కూడా ఇదే కేసులో కేటీఆర్ కు త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నా యంటున్నారు.