కేటీఆర్ ఫేడౌట్ అయిపోయారా?

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్రం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ప్రమేట్ చేసేవారు. అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నాటి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, పరస్పర దూషణలతో తెలంగాణ రాష్ట్రం పొలిటికల్లీ మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. నిత్యం ఏదో వివాదంతో జాతీయ స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రం పతాక శీర్షికలలో నిలుస్తోంది.

ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా ఆంధ్రాను అధిగమించి తెలంగాణ రాజకీయ వివాదాల్లో  అగ్రపీఠిన నిలుస్తోంది.  రాజకీయ విమర్శలు ఓ స్థాయి దాటి దూషణల పర్వానికి వెళ్లాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలతో దూకుడు ప్రదర్శిస్తుంటే.. అంతకు మించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ, దర్యాప్తుల పేరిట కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆయనకు కోర్టు నుంచి తాత్కాలిక ఉపసమనం లభించింది. అయితే వెంటనే ఇదే విషయంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ విషయం పక్కన పెడితే పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియోటర్ వద్ద జరిగన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలుపై విడుదల సంఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.

అల్లు అర్జున్ వ్యవహారం తెరపైకి రాగానే కేటీఆర్ అరెస్టు, కేసుల విషయం ఒక్కసారిగా ఫేడౌట్ అయిపోయింది.    ఫార్ములా ఇ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచడం, కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి రెడీ అవుతోందన్న వార్తలకు సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ స్థానం లేకుండా పోయింది.  ప్రజలు, మీడియా దృష్టి మొత్తం అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీకి తరలిపోతుందా అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంది. అసలు ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చిక్కులలో పడ్డారు అన్న చర్చకు తావే లేకుండా పోయింది. మొత్తంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఈడీ కేసు విషయాన్ని జనం పట్టించుకోలేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.