మాజీ మంత్రి బాలినేని.. ఏరీ? ఎక్కడా?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరు ఔనన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఇందులో సందేహం లేదు.  జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజలలో పరపతి ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని. ఆ తరువాత మూడేళ్లకు జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ లో స్థానం కోల్పోయారు. అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ ను గాభరా పెట్టింది. సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించాల్సి వచ్చింది. జగన్ కు బంధువు కూడా అయిన బాలినేని.. ఇక అప్పటి నుంచీ జగన్ ప్రభుత్వం పతనమయ్యే వరకూ వైసీపీలోనే కొనసాగినా.. నిత్య అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండో ఆర్ఆర్ఆర్ (అప్పటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు)లా మారిపోతారా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగింది.

ఏది ఏమైనా తన మాట చెల్లినా చెల్లకపోయినా బాలినేని మాత్రం ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యేంత వరకూ పార్టీలోనే ఉన్నారు. అయితే జగన్ తో ఆయన తీరు టామ్ అండ్ జెర్రీని తలపించేది. అలగడం, అవమానాలు భరించడం, అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపించడం ద్వారా ఆయన అప్పట్లో జగన్ కు నిత్య తలనొప్పులు తెచ్చి పెట్టారు. మంకు పట్టు పట్టి మరీ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీ నుంచి టికెట్ సాధించుకున్నా.. తాను కోరిన విధంగా మాగుంటకు ఒంగోలు లోక్ సభ టికెట్ ఇప్పించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ఒంగోలులో పరాజయాన్ని  చవి చూశారు. ఆ తరువాత ఆయన వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు.  అక్కడి వరకూ బానే ఉంది. ఆయన జేనసేనలో చేరే సమయంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలని భావించినప్పటికీ జనసేనాని పడనివ్వలేదు. బుద్ధిగా ఒక్కడిగా వచ్చి పార్టీ కండువా కప్పుకోవాలని విస్ఫష్టంగా చెప్పడంతో ఆయన జేనసేనలో చేరిక నిరాడంబరంగా జరిగిపోయింది. 

ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి.. మందీ మార్బలంతో ఆర్బాటంగా జనసేన కండువా కప్పుకోవాలని ఆయన భావించినా జనసేనాని అంగీకరించలేదు. మంగళగిరి వచ్చి ఒక్కడిగా పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన ఆ పని చేశారు. అప్పట్లో కొంత విరామం తరువాత జనసేన తరఫున ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనానినిని తీసుకువస్తానని అప్పట్లో బాలినేని చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడలేదు. అలాగే పార్టీ పదవి, మండలి సభ్యత్వం ఆశించిన బాలినేనికి జనసేనాని వాటిని ఆవిరి చేశారని బాలినేని అనుచరులు చెబుతున్నారు. నాగబాబుకు మండలి సభ్యత్వం, కేబినెట్ లో స్థానం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేనికి రాజ్యసభ స్థానం జనసేన ద్వారా అందని ద్రాక్షేనని తేలిపోయింది.

అసలు ఆయన జనసేన చేరికను ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. వాటన్నిటినీ అధిగమించి ఎలాగోలా జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేనికి ఆయన ఆశించిన ప్రాధాన్యతా పార్టీలో దక్కకపోవడం నిరాశనే మిగిల్చింది. అయితే ఎలాగోలా జనసేనలో ఒకింత ప్రాధాన్యత సాధించుకోవాలన్న తాపత్రయంతో అదానీ నుంచి జగన్ కు ముడుపులు అందినట్లు అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో బాలినేని మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేసి మరీ అప్పట్లో తనను అర్ధరాత్రి లేపి మరీ సంతకాలు చేయమని జగన్ ఒత్తిడి చేశారని చెప్పి ఒకింత సంచలనం సృష్టించారు. అయితే అదేమీ ఆయనకు జనసేనలో పెద్ద పీట వేయడానికి దోహదపడలేదు. పార్టీ అధిష్ఠానం బాలినేనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో  బాలినేని గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించారు.  ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో బాలినేని ఏరీ? ఎక్కడా అంటూ చర్చ జరుగుతోంది.