తొక్కి పారేస్తా.. వైసీపీ నేతలకు రోజా వార్నింగ్
posted on Mar 14, 2021 2:59PM
సొంత పార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈసారి గతంలో కంటే మరింత డోస్ పెంచారు. అంతూ చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. నగరితో పాటు పుత్తూరులో వైసీపీకే మేయర్ పీఠం దక్కింది. ఎన్నికల ఫలితాలపై స్పందించిన రోజా.. సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
తాను నిలబెట్టిన అభ్యర్థులను ఓడించేందుకు కొందరు నేతలు రెబెల్స్ ను పెట్టారని చెప్పారు. వాళ్లకు భారీగా డబ్బులు కూడా ఇచ్చారన్నారు. అయినా తన మనుషులే గెలిచారని చెప్పారు రోజా. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పోడిచిన నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రోజా. రెబెల్స్ ను ప్రోత్సహించిన నేతలను మున్సిపల్ చైర్మెన్ సీటు కాదు కదా.. మున్సిపల్ ఆఫీసు గేటును తాకనియబోనని రోజా వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుత్తూరులో పార్టీలో ఉంటూనే వ్యతిరేకంగా పని చేయగా.. నగరిలో మాత్రం రెబెల్స్ ను బరిలో నిలిపారని రోజా మండిపడ్డారు. పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారిని తొక్కిపారేశామని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటూ చీడ పురుగుల్లా మారిన వారిని ఏరివేయాలని రోజా అన్నారు. ప్రతిపక్షాన్ని ప్రజలు తుక్కుగా ఓడించారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున కూడా ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తాను నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా కొంత మంది నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. నగరి, పుత్తూరులో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని రోజా చెప్పారు. ఇప్పుడు ఫలితాల్లో రోజా చెప్పినట్లే జరిగింది. దీంతో రెబెల్ నేతలపై రోజా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.