శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం
posted on Dec 25, 2024 11:57AM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల పవిత్రత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, జరిగిన అపచారాల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కలియుగ వైకుఠం అనే తరుమలలోనే పవిత్రతకు భంగం వాటిల్లే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల వెళ్లిన చంద్రబాబు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన ఆరంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్న మాట ప్రకారం ఆయన తిరుమల ప్రక్షాళనకు నడుంబిగించారు.
తిరుమలలో భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, పారిశుద్ధ్య పరిస్థితిని చక్కదిద్దారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న, జల ప్రసాద వితరణను పునరుద్ధరించారు. కొండపై హోటళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దారు. ఆహారం నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువులు చేస్తున్న అన్యమతస్థులను బదలీ చేశారు. అలాగే కొండపై అన్యమత చిహ్నాలను తొలగింపచేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించారు. అలాగే తాజాగా శ్రీశైలంలో కూడా అన్య మత ప్రచారాన్ని నిషేధించారు.
అలాగే శ్రీశైలంలో అన్యమతాలకు సంబంధించిన కార్యకరాలపాలు, బోధనలపై నిషేధం విధించారు. అలాగే అన్యమత చిహ్నాలు కూడా శ్రీశైలంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అన్యమతానికి సంబంధించిన ఫోటోలు కలిగిఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతింబోమని ఈవో స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు.