భారతీయులు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా?
posted on Nov 25, 2022 10:41AM
ప్రపంచంలోని పుస్తకాలన్నీ అదృశ్యమైపోయినా ఒక్క భగవద్గీత మిగిలితే చాలు. ఇంకేమీ అవసరం లేదంటాడు మహాత్మాగాంధీ, మానసికతత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, నైతికవిలువలు....వెరసి ఒక మనిషి మనీషిగా, ఎదిగి ఉత్తమవ్యక్తిత్వంతో అలరారేందుకు అవసరమైన అంశాలన్నీ భగవద్గీతలో లభ్యమౌతాయి. జీవితానికి పునాది అయి, ప్రాణాధారం వంటి తత్వజ్ఞానం లభిస్తుంది. ఆ తత్త్వజ్ఞానాన్ని జీవితరంగంలో క్రియారూపంలో అనువర్తించే మార్గం లభిస్తుంది. నిత్యకృత్యాలలో ఎదురయ్యే చిన్న చిన్న సందేహాల నుండి క్లిష్టసమస్యల పరిష్కారం వరకూ అన్నీ భగవద్గీతలో లభిస్తాయి. అందుకే వ్యక్తి ఊహ ఎదిగి, వ్యక్తిత్వం స్థిరపడే సమయంలో గీతాపఠనం అతని ఎదుగుదల కాక దిశ కల్పిస్తుంది. ప్రపంచంలో మనిషి జన్మకు అర్ధం తెలిపి, ఆ జన్మను సార్ధకం చేసుకునేందుకు మార్గం చూపిస్తుంది. తాత్కాలిక సత్యం, శాశ్వత సత్యాలను గుర్తించటం నేర్పుతుంది. క్షణికావేశాలు, ఆకర్షణలను గుర్తించి నిజమైన భావనలను గుర్తించే విచక్షణను నేర్పుతుంది.
అంటే, శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచీ మంచి మాటలు నేర్పుతూ, జన్మించిన తరువాత మంచి ఆలోచననిస్తూ, ఎలాగైతే మొక్క ఎదిగి, తీగలా సరైన దిశలో పాకేట్టు సమాజం జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుందో, ఇప్పుడు చెట్టు, వృక్షమయ్యే సమయంలో భగవద్గీత సరైన దిశాదర్శనం చేస్తుందన్నమాట. ఈ జ్ఞానంతో సమాజసాగరంలో అడుగిడిన వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, విచక్షణతో తాను విజయుడవటమే కాక సమాజాన్ని విజయం దిశలో నడిపిస్తాడు. ఇది మన భారతీయ, వ్యవస్థలో వ్యక్తి విజయం కోసం స్వాభావికంగా ఏర్పరచిన బాట. అయితే ఈ బాటను విస్మరించి, ఈ జీవనవిధానాన్ని తృణీకరించటం వల్ల ఈనాడు మనకు కృత్రిమ అవయవాల వంటి పాశ్చాత్యప్రభావిత వ్యక్తిత్వవికాస డాక్టర్ల ఆలోచనలు అవసరం అవుతున్నాయి.
ప్రస్తుతవ్యవస్థలో భార్యభర్తలిద్దరికే కలసి జీవనం సాగించే ఓపిక ఉండటం లేదు, ఇక పెద్ద బంధుగణంతో కలసి జీవించే సహనం ఉండే పరిస్థితి లేదు. దాంతో జన్మించటం తోటే పసిపిల్లవాడికి లభించే 'భద్రత కవచం' లేకుండాపోయింది. భార్యభర్తలిద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సి రావటంతో, చివరి క్షణం వరకూ గర్భవతి అయిన స్త్రీ ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తోంది. దాంతో వాతావరణం ప్రసక్తి రావటం లేదు. మామూలు ఉద్యోగాలు, చిరాకులు, ఉద్విగ్నతలు తల్లితో పాటు గర్భంలో పిల్లవాడూ అనుభవించాల్సి వస్తోంది. ఇక పిల్లవాడు పుడుతూనే ఓ 'సమస్య' అవుతున్నాడు. తల్లిదండ్రుల జీవితంలో 'అద్భుతం' కావాల్సిన పిల్లవాడి ఆలన పాలనలు బరువైపోవటంతో, పిల్లవాడు పని సమయాల్లో 'అనాథ'లా క్రచ్లలో ఉండాల్సి వస్తోంది.
సుమతీ శతకాలు, లాలిపాటలు, జోలపాటలు పాడే ఓపిక, తీరికలు ఎవరికీ ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇది టీవీలు, మొబైల్ ఫోన్ ల యుగం కావటంతో, వ్యాపార విలువలే ప్రధానం కావటంతో పిల్లవాడికి సినీ పాటలే సుమతీ శతకాలవుతున్నాయి. రీమిక్స్లు జోలలవుతున్నాయి. కార్టూన్లు, క్రైమ్ నాటకాలు పురాణాలవుతున్నాయి. అంటే, జీవితమంటే ఏమిటో తెలియకనే, ఈ ప్రపంచంలో తన పాత్ర ఏమిటో ఆలోచన లేకుండానే, అత్యంత అశాంతితో, అభ్యనతా భావంతో, పిల్లలు ప్రపంచంలోకి అడుగిడుతున్నారు. దీనికి తోడు విజయం అంటే 'డబ్బు సంపాదన' అన్న భావం సమాజంలో స్థిరపడింది.
పాఠశాలల్లో నైతికవిలువల బోధన కొరవడింది. డబ్బును బట్టి చదువు లభ్యమౌతుంది. అదీ ఉద్యోగ సంపాదన చదువు తప్ప, మనిషికి వ్యక్తిత్వాన్నిచ్చే చదువు కాదు. దాంతో విచక్షణ అన్నది అదృశ్యం అవుతోంది. ఇటువంటి పరిస్థితులలో మనకు మానసిక డాక్టర్లు, వ్యక్తిత్వవికాస కౌన్సిలర్లు అవసరమౌతున్నారు. అంటే కోకిల కాకి అయ్యే ప్రయత్నాలు చేస్తూండటంతో, ప్రస్తుతం కాకి కోకిలకు 'పాట' నేర్పుతోందన్న మాట! ఎప్పుడైతే ఈ సత్యం అర్థమౌతుందో, అప్పుడే జీవితాలలో మార్పు మొదలవుతుంది. నిజమే కదా!!
◆నిశ్శబ్ద.