అహల్య వృత్తాంతం మనకు తెలియజేసే నీతి ఏమిటి?
posted on Apr 16, 2024 9:30AM
ఒక సాధారణ స్త్రీగా జీవించి ఉంటే ఏనాడో కాలగతిలో ఆమెను మరచిపోయి ఉండేవాళ్ళం ఏమో... కానీ విధివైపరీత్యం ఆమెను పతివ్రతా శిరోమణిగా చేసింది. ఆమె గౌతమ మహర్షి భార్య అయిన అహల్య, ఒక సన్న్యాసికీ, మహర్షికి మధ్య తేడా ఉంది. సన్న్యాసి అంటే గృహసంబంధమైన బాంధవ్యాలు ఉండవు. అన్నింటినీ పరిత్యజిస్తారు. ఋషికి కుటుంబం ఉంటుంది కాని నగరంలో జీవించరు. సమాజానికి దూరంగా జీవిస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరమాత్మను తెలుసుకోవడంలో మునిగి ఉంటారు. శిష్యులకి విద్యను బోధిస్తూ తమ జీవనాన్ని సాగిస్తారు. పూర్వం విద్యార్థులు గురువు దగ్గర ఉండి వారితో కలిసి జీవిస్తూ, క్రమశిక్షణతో విద్య నేర్చుకుని విద్యాభ్యాసం పూర్తయ్యాక తిరిగి సమాజంలోకి అడుగు పెట్టేవారు.
ఈ విధంగానే గౌతమ మహర్షి కూడా తన భార్యతో కలిసి అడవిలో జీవించేవాడు. అహల్య అంకితభావంతో భర్తకి సేవ చేసేది. అయితే ఆమె ప్రమేయం లేకుండానే అహల్య జీవితంలో ఒక అపశృతి దొర్లింది. తప్పులు అందరూ చేస్తూనే ఉంటారు కాని, ఆ రోజుల్లో చిన్న తప్పుకి కూడా పెద్ద శిక్షలు ఉండేవి.
అహల్య తెలిసి చెయ్యకపోయినా జరిగిన తప్పుకి ఆమె బాధ్యురాలయింది. నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే గౌతముడు అహల్య తనని మోసం చేసిందనుకుని భ్రమపడి కోపంతో మండిపడ్డాడు. ఒక్క క్షణం ఓర్పు వహించి ఉంటే తన భార్య తప్పిదం ఏమిటో ఆయనకి అర్థమై ఉండేది. కాని తొందరపాటుతో వెంటనే శపించాడు.
గౌతమ మహర్షి అహల్యని పాషాణంగా మారమని శపించాడు. అహల్య తన దురదృష్టానికి చింతించక శిక్షను ఆహ్వానించింది. చిన్ననాటినుండి ఓర్పుకి మొదటి ఉదాహరణ భూదేవే అని తెలుసుకుంది. అందువలన తెలియక జరిగినా తన పొరపాటు ఉంది కనుక అందుకు శిక్ష అనుభవించడానికి ఆమె సిద్ధపడింది. కోపం శాంతించిన తరువాత గౌతముడికి తన భార్య వల్ల జరిగిన తప్పు అంత పెద్దదేమీ కాదని తెలుసుకున్నాడు. అయినా తను వేసిన శిక్ష పెద్దది అనుకుని పశ్చాత్తాప పడ్డాడు. అయితే ఇచ్చిన శాపాన్ని ఆమె అనుభవించక తప్పదు కదా!
గౌతముడు భార్యతో "మనం చేసిన దుష్కర్మలకు ప్రతిఫలం స్వీకరించాలి. పూర్వ జన్మ కర్మ ఫలితంగా భావించి నీవు సహనంతో అనుభవించాల్సిందే! నీవు త్వరలోనే రక్షించబడతావు, శ్రీరామచంద్రుడు ఇటుగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అతడి పాదస్పర్శ ద్వారా నీకు శాపవిమోచనం కలుగుతుంది. ఒక ఆదర్శ వనితగా నువ్వు చరిత్రలో గొప్ప ఉదాహరణగా నిలిచిపోతావు" అని ఓదార్చాడు. అహల్య తనకు వచ్చిన ఆపదను అనుభవించడానికి సిద్ధపడింది. ఉలిదెబ్బలు తగలనిదే శిల్పం తయారు కాదు. కష్టం లేనిదే ఘనకార్యాలు సాధించబడవు.
జీవితంలో రాయిగా బ్రతకటం కంటే దురదృష్టకరమైన సంఘటన మరొకటి ఉండదేమో! అహల్య ఇప్పుడు ఈ విపత్తునే ఎదుర్కొంటోంది. కానీ ఈ ఆపదను ఒక అవకాశంగా మలుచుకుంది. ఏ మాత్రం కలత చెందక, నిరాశా నిస్పృహలకు గురికాకుండా, తన సమయాన్నంతా భగవత్ ప్రార్ధనలో గడపసాగింది. ఎవ్వరూ వినాశనాన్ని పొందరని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే జరిగినదానికి కోపంగాని, బాధగాని ఆమెకి లేవు. తనకి కలిగిన పరిస్థితికి తలవంచి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతోంది. కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మంచి పనులు చేస్తూపోతే కష్టాలు అనుభవిస్తున్నామనే ఆలోచన కలగదు.
విధిని ఎవరూ ఎదిరించలేరు. వేదాంతం మనకు ఈ విధంగా బోధిస్తుంది, దుర్భర పరిస్థితులు ఎల్లకాలం ఉండవు. ఏదో ఒకనాడు అవి తొలగిపోగలవు. పాపాలు తప్పిదాల నుండే ఉద్భవిస్తాయి. గతంలో విషబీజాలు నాటి ఉంటే దాని ఫలితం వచ్చే తీరుతుంది కదా! అయితే ప్రారబ్ధం అనుభవించడం ద్వారా గత కర్మల బీజాలను నాశనం చేయవచ్చు, ఆగామి కర్మలను మొలకెత్తనివ్వని రీతిగా మలుచుకోవచ్చును. లేదా మంచి విత్తనాలను నాటడం ద్వారా చక్కటి ఫలితాలను పొందవచ్చును. ప్రారబ్ధం అనేది బంగారానికి సానపెట్టడం వంటిది. గత కాలపు చేదు అనుభవాలను గుర్తుపెట్టుకుని, వర్తమానంలో గరిక పోచలను కాకుండా మధుర ఫలాలను ఇచ్చే మేలురకపు విత్తనాలను నాటాలి!
నిష్కామసేవ చేస్తూ మంచితనాన్ని కలిగి ఉండాలి. వ్యతిరేకపు ఆలోచనలను రానివ్వక మంచి భావాలను కలిగి ఉండాలి. గతం ఎంతటి చేదుదైనా, భవిష్యత్తుని రూపొందించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది అహల్య వృత్తాంతం మనకు చెప్పకనే చెబుతుంది.
◆నిశ్శబ్ద.