ప్రపంచ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తున్న టాలీవుడ్‌.. వెలవెలబోతున్న బాలీవుడ్‌!

ఒకప్పుడు భారతదేశంలోని సినీ పరిశ్రమల్లో బాలీవుడ్‌ అగ్రస్థానంలో ఉండేది. సినిమా మేకింగ్‌ అంటే బాలీవుడ్‌ దర్శకనిర్మాతల నుంచే నేర్చుకోవాలి అనేంతగా మిగతా చిత్ర పరిశ్రమలను వారు ప్రభావితం చేశారు. అప్పటికే సినిమాల సంఖ్య విషయంలో టాలీవుడ్‌ ముందుండేది. ఇండియాలోనే ఎక్కువ సినిమాలు నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్‌కి గుర్తింపు ఉంది. అయితే బడ్జెట్‌ పరంగా, క్వాలిటీ పరంగా బాలీవుడ్‌ను ప్రత్యేకంగా చెప్పుకునేవారు. 2000 సంవత్సరం వచ్చేసరికి దేశంలో బాలీవుడ్‌ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. తెలుగు సినిమా ఆ విషయంలో ఎంతో అభివృద్ధి సాధించింది. కంటెంట్‌ పరంగా, మేకింగ్‌ పరంగా ఎంతో ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా సౌత్‌లోని తెలుగు, తమిళ్‌, మలయాళ ఇండస్ట్రీలు బాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగాయి. 

2015లో ‘బాహుబలి’ పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అవ్వడం, సంచలన విజయం సాధించడంతో ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలు టాలీవుడ్‌పై దృష్టి సారించాయి. సౌత్‌లోని చిత్ర పరిశ్రమలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఒక్కసారిగా టాలీవుడ్‌ ముందుకు దూసుకొచ్చింది. ఇక 2017లో ‘బాహుబలి2’ రిలీజ్‌ తర్వాత టాలీవుడ్‌ ఇండియాలోనే తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఒక మంచి కథను ఎలా ప్రజెంట్‌ చెయ్యాలి, హీరోని సినిమాలో ఎలా ఎలివేట్‌ చెయ్యాలి అనే విషయాల్లో టాలీవుడ్‌ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. 

తెలుగుతోపాటు తమిళ్‌, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలు కూడా తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఉదాహరణ గత ఏడాది బాలీవుడ్‌లో జవాన్‌, యానిమల్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌ని రూపొందించిన దర్శకులు అట్లీ, సందీప్‌రెడ్డి సౌత్‌వారే కావడం. జవాన్‌ ప్రభంజనాన్ని చూసిన సల్మాన్‌ ఖాన్‌..  అట్లీతో సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడంటే సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌ స్టార్స్‌ని ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్‌ఖాన్‌, రజినీకాంత్‌లతో అట్లీ ఓ భారీ మల్టీస్టారర్‌ను చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు వైరల్‌ అవుతోంది. సౌత్‌ సినిమాలకు, దర్శకులకు ఇంత ప్రాధాన్యం ఏర్పడడం,  ప్రపంచ మార్కెట్‌ను సౌత్‌ సినిమాలు శాసించడం వెనుక ఉన్న బలమైన శక్తి రాజమౌళి అనే చెప్పాలి. రాజమౌళి చేసిన బాహుబలి వల్లే ఇంతటి విస్తృతమైన మార్కెట్‌ సౌత్‌ సినిమాలకు లభిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌తో ఆ మార్కెట్‌ని ఎక్కడికో తీసుకెళ్లి తెలుగువాడి సత్తా ఇదీ అని ప్రూవ్‌ చేస్తున్నారు రాజమౌళి. 

తాజాగా విడుదలై విజయవిహారం చేస్తున్న ‘కల్కి’ బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలను షాక్‌కి గురి చేస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో నాగ్‌ అశ్విన్‌ అనే డైరెక్టర్‌ ఉన్నాడన్న విషయం బాలీవుడ్‌లో తెలీదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న ‘కల్కి’ చూసిన తర్వాత నాగి అంతకుముందు చేసిన ఎవడే సుబ్రమణ్యం, మహానటి చిత్రాలను ఓటీటీలో వీక్షిస్తున్నారు. ఇక పుష్ప చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడంతో పాన్‌ ఇండియా లెవల్‌లో సుకుమార్‌ పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాకి ఆస్కార్‌ రావడంతో తెలుగు సినిమాపై అందరికీ గౌరవం పెరిగిపోయింది. అంతేకాదు, త్వరలో విడుదల కాబోయే టాలీవుడ్‌ టాప్‌ హీరోల సినిమాలు తెలుగు సినిమా రేంజ్‌ని మరింత పెంచుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.