పాపం.. జగన్‌కి నిద్ర పడుతుందో.. లేదో!

ఎంత కోటీశ్వరుడికైనా, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు వున్నా, ఏ మనిషికైనా కావలసింది... కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. కడుపు నిండా తిండి ఎలాగైనా వస్తుందేమోగానీ, కంటి నిండా నిద్ర మాత్రం అంత ఈజీగా దొరికేది కాదు. నా దగ్గర బోలెడన్ని కోట్లు వున్నాయి.. నిద్రా.. రా.. అంటే నిద్ర వచ్చేయదు. పోనీ, డబ్బుంది కదా... నిద్రని కొనుక్కుందామా అంటే, అదికూడా సాధ్యమయ్యే విషయం కాదు.. నిద్ర గురించి ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, లక్షల కోట్ల ఆస్తులు వున్న వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి భవిష్యత్తులో నిద్రకి సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారేమోనని అనిపిస్తోంది. అందుకే ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

జగన్మోహన్‌రెడ్డి మనలాగా సాధారణ పౌరుడు. మనం దేశ సరిహద్దుల్లో సైన్యం కాపలాగా వున్నారన్న ధైర్యంతో గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతాం. జగన్మోహన్‌రెడ్డి కూడా అంతే, తన ప్యాలెస్‌ చుట్టూ దాదాపు వెయ్యిమంది పోలీసులు కాపలాగా వున్నారన్న ధైర్యంతో హాయిగా నిద్రపోతూ వుంటారు. ఒక్క పోలీసులు మాత్రమేనా.. బోలెడన్ని చెక్‌పోస్టులు... వందలకొద్ది సెక్యూరిటీ పరికరాలు.. ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా బారికేడ్లు... ఇక ఆయుధాల సంగతి సరేసరి. జగన్ ముఖ్యమంత్రిగా వుండగా తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ ఈ సదుపాయాలు వుండేవి కాబట్టి ఆయన హాయిగా నిద్రపోయేవారు. ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు ఆ సదుపాయాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి.. మరి... ఆయన ఇక హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోగలరా?

గతంలో జగన్ ఇంటి ముందు నుంచి సాధారణ పౌరులు ప్రయాణించడానికి అవకాశం వుండేది కాదు.. ఇప్పుడు అలా కాదు.. జగన్ ఇంటి ముందు వున్న రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడని అధికారులు తొలగించారు. ఇప్పుడు  ఎవరైనా ఆ రోడ్డులో హాయిగా ప్రయాణించవచ్చు. హై సెక్యూరిటీ జోన్ వ్యవస్థలో భాగంగా వున్న ఆటోమేటిక్ పరికరాలను తొలగించారు. ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలతో జగన్ ఇంటి చుట్టూ వున్న రోడ్లతో ప్రవేశిస్తే, వాటిని ఆపడానికి రెండు టైర్ కిల్లర్లు, నేలలో నుంచి పైకి లేచే నాలుగు హైడ్రాలిక్ బుల్లెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటినీ తొలగించారు. జగన్ ఇంటి దగ్గర భద్రతకోసం అన్నట్టుగా ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. జగన్ ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొత్తం తీసేశారు. అలాగే, మొన్నటి వరకు జగన్‌కి సెక్యూరిటీగా వున్న దాదాపు వెయ్యిమంది పోలీసుల స్థానంలో 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే మిగిలింది. జగన్ ఇంటి పక్కనే సెక్యూరిటీ సిబ్బంది కోసం అనుమతి లేకుండా నిర్మించిన పక్కా గృహాలను, గవర్నమెంట్ ఖర్చుతో జగన్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా త్వరలో తొలగిస్తారు. మరి, ఇంతకాలం ఇంత సెక్యూరిటీ, హడావిడి వుంటే తప్ప జగన్ నిద్రపోయేవారు కాదు.. మరి ఇకముందు జగన్‌కి ఎలా నిద్ర పడుతుందో ఏమో!