బైరెడ్డి శబరి ప్రసంగం.. లోక్ సభ స్పెల్ బౌండ్!

తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను బైరెడ్డి శబరి గట్టిగా తిప్పి కొట్టారు. ఆయన ప్రసంగంలోని తప్పులను ఎత్తి చూపారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో జగన్ సర్కార్ విధ్వంసాన్నీ ఎండగట్టారు. ఆమె అనర్గళంగా ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని సభ మొత్తం స్పెల్ బౌండ్ అయ్యి ఆలకించింది. చప్పట్లతో అభినందనలు తెలిపింది.

ఇంతకీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు తన ప్రసంగంలో చంద్రబాబు ఈడీ కేసులో అరెస్టయ్యారనీ, అటువంటి వ్యక్తి మద్దతుతో మోడీ సర్కార్ మనుగడ సాగిస్తోందనీ అన్నారు. వెంటనే బైరెడ్డి శబరి చంద్రబాబును అరెస్టు చేసింది ఈడీ కాదు.. ఏపీ సీఐడీ అని కరెక్ట్ చేశారు. అలాగే చంద్రబాబును జగన్ సర్కార్ కేవలం కక్ష పూరితంగా అక్రమంగా అరెస్టు చేసిందని చెప్పారు. అలాగే చంద్రబాబు ఊతకర్ర కాదనీ, కత్తి అని చెబుతూ  ఆయనను  సీఐడీ నంద్యాలలో   అరెస్ట్ చేశారు, అందుకే నంద్యాల జిల్లా మొత్తంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు.  తన తొలి ప్రసంగంలోనే శబరి   హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి బాటలో పరుగులు తీయించిన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు.

అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందనీ, వైసీపీ హయాంలో ఏపీ సర్వ విధాలుగా నాశనమైపోయిందని విమర్శించారు.  దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అంటూ విమర్శలు చేశారు.  వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగా ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఏపీ రాజధాని అమరావతికి అప్పట్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయాన్ని శబరి తన ప్రసంగంలో గుర్తు చేశారు. అలాగే  వైసీపీ మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ను కూడా వైసీపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం హయాంలో  పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ  ఐదేళ్ల పాలనలో ఒక్క శాతం పనులు కూడా చేయలేదని,  జగన్ హయాంలో  మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిచాయని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి బాట పడుతుందనీ, అందుకు కేంద్రం సహకారం అవసరమనీ తన ప్రసంగాన్ని ముగించారు.