పాతగాయాలను కెలకడమెందుకు హరీష్!?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమై అధికారానికి దూరమైంది. ఉద్యమ పార్టీగా మొదలై అధికారం సాధించిన ఆ పార్టీ, ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రజాదరణ కోల్పోయి అధికారానికి దూరమైన తరువాత బీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంటే అవసరమైంది. అధికారంలో ఉండగా పాండవులు తమ అస్త్రాలను జమ్మి జట్టుపై దాచినట్లు.. బీఆర్ఎస్ కూడా సెంటిమెంటు అస్త్రాన్ని రాజకీయం మాటున దాచేసింది. అవసరార్ధం ఇప్పుడు బయటకు తీయడానికి ప్రయత్నిస్తోంది.   తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో జరుగుతున్న ప్రయత్నాన్ని సెంటిమెంట్ అస్త్రంతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఔను.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీయడానికి రెడీ అయిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఈ పదేళ్లలోనూ విభజన సమస్యల సామరస్య పరిష్కారానికి ఇటువంటి ఒక ప్రయత్నం జరిగిన దాఖలాలు కనిపించవు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయయుడు ఈ దిశగా చొరవ తీసుకుని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన రేవంత్ క్షణం ఆలస్యం చేయకుండా చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారు. ఇరువురూ ఈ నెల 6న ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులూ విభజన సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావడం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలంటే పాతగాయాలను కెలుక్కోవడం కాదు... అగాధాలను పూడ్చుకుని రెండు రాష్ట్రాలూ ప్రగతి దారిలో ముందుకుసాగడానికి బాటలు పరచడం. 

అయితే తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ మాత్రం ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల నెగడు రావణ కాష్టంలా రగులుతుంటేనే తమకు మనుగడ అని  భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు చంద్రబాబు, రేవంత్ ల భేటీని స్వాగతిస్తూనే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన చందంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. 
విభజన సమస్యల పరిష్కారం కోసం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముందుకు రావడం మంచిదే అంటూనే హరీష్ రావు విలీన మండలాల ప్రస్తావన తీసుకువచ్చారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును రగల్చడానికి ప్రయత్నించారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించే ముందు రేవంత్ రెడ్డి విలీన మండలాలను మళ్లీ  వెనక్కు ఇవ్వాలన్న షరతు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేస్తు న్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకువచ్చి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించుకున్నారనీ, అప్పట్లో ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కూడా సమర్ధించారనీ గుర్తు చేశారు. ఏకపక్షంగా జరిగిన ఈ విలీనం తెలంగాణ సమాజం హర్షించలేదని ఇప్పుడు అంటున్నారు.  

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ఏడు విలీన మండలాలూ ముంపునకు గురౌతాయి. ఈ మండలాలు ఏపీలో విలీనం కాకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే అవకాశమే లేదు. అందుకే అప్పట్లో చంద్రబాబునాయుడు ఈ మండలాల విలీనం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కనుక ఆ పార్టీ కూడా ఏడు మండలాల విలీనాన్ని సమర్ధించింది. విలీనం జరిగిపోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమూ మొదలైపోయింది. ఇప్పుడు ఆ మండలాలను వెనక్కు ఇవ్వాలంటూ కండీషన్ పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేయడం రాజకీయ లబ్ధి కోసమే కానీ మరొకందుకు కాదు. అది జరిగే పని కాదని ఆయనకూ తెలుసు. కానీ అధికారానికి దూరమై, ప్రజామద్దతు కోల్పోయిన బీఆర్ఎస్  మళ్లీ పుంజుకోవాలంటే విలీన మండలాల పేరుతో సెంటిమెంట్ రగల్చడమే మార్గమన్న భావనతోనే షరీష్ రావు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసలు తెలంగాణ అన్న పదాన్నే తన పార్టీ పేరు నుంచి తొలగించి... జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేయాలని కలలుగన్న ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకుని   పలుకుబడి సాధించాలని చేసే ప్రయత్నాలు ఫలించవని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను లేవనెత్తడం కొరివితో తల గొరుక్కోవడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్లకు, స్వామీజీలకు ఇచ్చిన ప్రాధాన్యతను జనం వారికి గుర్తు చేసి ఎగతాళి చేసే అవకాశాలున్నాయంటున్నారు.