టెయిల్‌పాండ్‌పై తెలంగాణ, ఆంధ్రా వాదనలు.. మాది.. కాదు మాది

కలిసి విడిపోదాం.. విడిపోయినా అన్నదమ్ముల ఉందాం అని తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర్రాలు.. రాష్ట్రం విడిపోయేముందు ఎన్నో ప్రగల్భాలు పలికాయి. కానీ అవి మాటల వరకే అని చాలా తక్కువ సమయంలోనే నిరూపించి చూపాయి. ఇప్పటికే ఎన్నో వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరిగిపోతుంది. దానికి తోడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఒకటి.. ఈ ఘటన రెండు రాష్ట్రాల మధ్య సమరానికే తెరలేపింది.. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మాటలయుద్ధాలు రోజురోజుకు పెరతున్నాయే తప్ప తగ్గడంలేదు.

 

మళ్లీ ఇప్పుడు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ మాదంటే మాదని రెండు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. నిర్మాణ ఖర్చుమొత్తం తెలంగాణ ప్రభుత్వంపై వేశారని అది మాకే చెందుతుందని ఒకవైపు తెరాస సర్కార్ అంటుంది. టెయిల్ పాండ్ నిర్మాణానికి మొత్తం రూ.400కోట్లు ఖర్చయిందని.. ఆ రుణం మొత్తాన్ని విద్యుత్ శాఖ విభజన అప్పుడు తెలంగాణ జెన్‌కో ఖాతాలో వేశారని.. ఇప్పుడు డ్యాం నిర్వహణను ఇవ్వనంటే ఎలా కుదురుతుందని తెలంగాణ సర్కార్ వాదిస్తుంది.

 

మరోవైపు టెయిల్ పాండ్ ఆంధ్రా అంతర్భాగంలో ఉందని ముమ్మాటికీ మాకే చెందుతుందని ఏపీ సర్కార్ మొత్తుకుంటుంది. టెయిల్ పాండ్ డ్యాం ఆధారంగా 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. దీనికి అయ్యే వ్యయభారమంతా ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని.. డ్యాం నిర్మాణానికి కోట్లు ఖర్చు చేశామంటున్న తెలంగాణ ప్రభుత్వం వాదన సరికాదని.. ఎలాంటి వివాదాలు లేని ప్రాజెక్టుపైనా పేచీ పెట్టడం సరికాదని ఏపీ జెన్ కో అధికారులు అంటున్నారు. మొత్తానికి ఏ చిన్న విషయంమైనా తెలంగాణ, ఆంధ్రా అనే మాట మాత్రం ముందు బయటకు వస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు హైకోర్టులో మొట్టికాయలు తిన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా వాదనలు మాని సమస్యను సవ్యంగా పరిష్కరించుకుంటే మంచిది.