బెయిలు కోసం కోర్టుకు మిథున్ రెడ్డి.. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు భయం!

వైసీపీ హయాంలో అడ్డగోలు దోపిడీకి, దౌర్జన్యాలకూ తెగబడిన ఒక్కో నేత ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా  చేరారు.  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయిన  రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెైస్టు భయంతో ముందస్తు బెయిలు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రభుత్వం పెట్టిన కేసులతో తనకు ఇసుమంతైనా సంబంధం లేదన్న మిథున్ రెడ్డి లోక్ సభ సభ్యుడినైన తనకు  రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.  ప్రభుత్వం మాత్రం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని విధాన నిర్ణయాలలో ఆయన జోక్యం ఉందని కేసులో పేర్కొంది. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనతో మిథున్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రమాయలు చేసింది. అలాగే   ప్రసిద్ధ మద్యం బ్రాండ్ల కంటే స్థానిక మద్యం బ్రాండ్లనే ప్రోత్సహించింది.  వైసీపీ హయాంలో  జరిగిన మద్యం కుంభకోణంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి  మూడు నెలల్లోగా నివేదిక సమర్పించి దోషులను అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన అనేక డిస్టిలరీలు నాసి రకం మద్యాన్ని సరఫరా చేశాయనీ, ఆ మద్యాన్నే   ప్రభుత్వం  అధిక ధరలకు విక్రయించిందనీ తేలింది. ఈ డిస్టిలరీలు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉన్నాయని తేలింది.  ఈ విషయాన్ని  ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్  వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే  మిథున్ రెడ్డి  యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు  ఆ పిటిషన్ విచారణ కోర్టులో జరగాల్సి ఉంది.