బొత్స రూటెటు?.. వైసీపీలో కొత్త టెన్షన్?
posted on Mar 19, 2025 2:21PM
.webp)
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పక్క చూపులు చూస్తున్నారా? వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని భయపడుతున్నారా? ఒక్కడిగా కాకుండా ఒక టీమ్ గా పార్టీని వీడాలని ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచే కాదు వైసీపీ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తున్నది.
బొత్స పార్టీ మార్పు గురించి ఇప్పుడే కాదు గతంలోనూ వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత బొత్స సత్యనారాయాణ కొద్ది కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అడుగులు జనసేన వైపు పడుతున్నాయన్న ప్రచారం ఓ రేంజ్ లో చేరింది.
సరిగ్గా ఆ ప్రచారం జోరుగా ఉన్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను రంగంలోకి దించారు. తెలుగుదేశం కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. ఆ సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినా జగన్ ఖాతరు చేయలేదు. బొత్స పార్టీ మారకుండా ఆపడానికి ఆయనను ఎమ్మెల్సీ చేయడమే మార్గమని జగన్ భావించారు.
ఎమ్మెల్సీగా ఎన్నికయిన తరువాత బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలకంగా మారారు. మండలిలో విపక్ష నేతగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రులను నిలదీస్తున్నారు. వైసీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో, మండలిలో విపక్ష నేతగా వైసీపీ వాయిస్ ను బొత్స బలంగా వినిపిస్తూ వస్తున్నారు. తాను ఒక్కడిగా కాకుండా సభలో వైసీపీ సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో జగన్ కంటే బొత్స బెటర్ అన్న అభిప్రాయం వైసీపీ ఎమ్మెల్సీలలో ఏర్పడిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే వైసీపీలో అంతర్గతంగా జరుగు తున్న పరిణామాలతో బొత్స ఒకింత అసంతృప్తితో ఉన్నారనీ, జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆయన పార్టీ వర్గాల వద్ద నిర్మొహమాటంగా తప్పుపడుతున్నారనీ అంటున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని తద్వారా ప్రజల్లోకి మంచి మెస్సేజ్ వెళ్తుందని, అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం ద్వారా ప్రజా సమస్యలు వైసీపీ పట్టడంలేదన్న భావన కలుగు తుందని బొత్స జనగ్ కు చెప్పారనీ, అసెంబ్లీకి హాజరు కావాలని సూచించారనీ, అయితే జగన్ ఆ సూచనను పట్టించుకోకపోవడంపై బొత్స అసంతృప్తితో ఉన్నారనీ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఇక్కడే బొత్స తన అసంతృప్తిని బహిర్గతం చేయకుండా చాపకింద నీరులా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగిన బొత్స.. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. వైఎస్ఆర్ మరణం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతల్లో ఒకరిగా కొనసాగారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజాబలం కలిగిన నేతగా బొత్స ఎదిగారు.
2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన బొత్సకు జగన్ ప్రాధాన్యత ఇచ్చా రు. జగన్ కేబినెట్ లో బొత్స మంత్రిగా పని చేశారు. అప్పట్లో జగన్ తీసుకున్న పలు నిర్ణయాలపై బొత్స బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినీ హీరోల పట్ల జగన్ ప్రవర్తనను బొత్స ఖండించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి పట్ల జగన్ వ్యవహరించిన తీరు పట్ల బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. చిరంజీవి కుటుంబంతో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తోనూ బొత్సకు మంచి సంబంధాలు ఉన్నాయి. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి బొత్స ప్రత్యేకంగా మాట్లాడారు. అంతే కాదు.. పవన్ కల్యాణ్‌ను బొత్స విమర్శించిన సందర్భాలు చాలా తక్కువే.
దీనికి తోడు జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేసిన సమయంలో.. జగన్ కు కాకపోతే కనీసం పవన్ కు అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అన్నారు. శాసనమండలిలో కానీ.. మరో చోట కానీ పవన్ కు వ్యతిరేకంగా బొత్స ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఎత్తి చూపుతూ బొత్స పార్టీ మార్పు యోచన చేస్తున్నారన్నడానికి ఇదే తార్కానమంటున్నారు వైసీపీ వర్గీయులు. బొత్స సత్యనారాయణ రాజకీయంగా ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నేత. సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రోజు కాకపోతే రేపైనా బొత్స జనసేనసేలో చేరడం ఖాయమన్న వాదన వైసీపీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.
మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారు. సభలో ప్రతిపక్ష నేత పాత్రకు న్యాయం చేస్తూనే సభ బయట మాత్రం అధికార పక్ష నేతలతో , మరీ ముఖ్యంగా జనసేన నేతలతో సఖ్యతగా ఉంటున్నారు. బొత్స ఈ తీరే ఆయన వైసీపీని వదిలేస్తారనీ, జనసేన గూటికి చేరతారనీ ప్రచారం జరగడానికి దోహదం చేస్తున్నది. జగన్ ఏకపక్ష వైఖరి, ఇటీవలే ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ నేతగా తానున్నా… తనను కాదని ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించిన తీరుపై బొత్స అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే బొత్స ఎప్పుడు గడపదాటతారా అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది.