విజయశాంతికి నో కేబినెట్ బెర్త్?.. కొండా సురేఖ వ్యాఖ్యల అర్ధం అదేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు మార్లు రేవంత్ కేబినెట్ విస్తరణకు ఇదిగో, అదిగో అంటూ పలు ఊహాగాన సభలు జరిగాయి. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత రేవంత్ కేబినెట్ లో బెర్త్ ఖాయం అంటూ ఇప్పటి దాకా వినిపించని పేరు ఒకటి తెరమీదకు వచ్చింది. రేవంత్ సర్కార్ కొలువుదీరి 15 నెలలు అయినప్పటికీ.. ఇప్పటి దాకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పడ లేదు. కీలకమైన శాఖలకు మంత్రి లేని పరిస్థితి ఉంది.  ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ఆయనతో కలిసి 12 మంది ఉన్నారు. మరో ఏడు స్థానాలు భర్తీ చేసుకునే అవకాశం రేవంత్ కు ఉంది.

అయినా అధిష్ఠానం పచ్చ జెండా ఊపకపోవడంతో ఆయన ఉన్న వారితోనే బండి లాగించేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కేబినెట్ విస్తరణ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా అధిష్ఠానం ఆశీస్సులతో అనూహ్యంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి కేబినెట్ బెర్త్ కన్ ఫర్మ్ అన్న చర్చ కూడా జోరందుకుంది. కేబినెట్ బెర్త్ వార్తలపై విజయశాంతి కూడా స్పందించారు. అంతా అధిష్ఠానం నిర్ణయం అని చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయవర్గాలలో విజయశాంతికి రేవంత్ కేబినెట్ లో కీలక పదవి ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సరిగ్గా ఈ తరుణంలో మంత్రి కొండా సురేఖ మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.   మీడియా చిట్ చాట్ లో  కొండా సురేఖ మంత్రివర్గ విస్తరణకు ఇంకా సమయం ఉందన్నారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదన్నారు. ఒక వేళ ఉన్నా.. కౌన్సిల్ నుంచి ఎవరికైనా అవకాశం దక్కే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.  ఆమె పరోక్షంగా విజయశాంతికి కేబినెట్ బెర్త్ ఉండదని చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.